మాట తప్పిన యువ కథానాయకుడు

Update: 2017-03-09 09:40 GMT

దర్శకత్వ శాఖలో పనిచేయటానికి వచ్చి కథానాయకుడిగా మారి కెరీర్ గ్రాండ్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్న వారిలో రాజ్ తరుణ్ ఒకరు. ఉయ్యాలా జంపాల, సినిమా చూపిస్త మామ, కుమారి 21 ఎఫ్, ఈడో రకం ఆడో రకం వంటి విజయ వంతమైన సినిమాలని తన ఖాతాహాలో వేసుకున్న రాజ్ తరుణ్ గత వారం తన తాజా చిత్రం కిట్టు వున్నాడు జాగ్రత్త సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురాగా పోటీగా వచ్చిన ఇతర సినిమాలపై పై చేయి సాధించి మోస్తరు ఫలితాలని రాబట్టగలిగింది. అయితే రాజ్ తరుణ్ కథానాయకుడిగా చేస్తున్న సినిమాలతో పాటు నాచురల్ స్టార్ నాని నటించిన మజ్ను మరియు కుమారి 21 ఎఫ్, ఈడో రకం ఆడో రకం సినిమాలలో అతనికి జోడిగా నటించిన హెబ్బా పటేల్ లీడ్ రోల్ చేసిన నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ అనే చిత్రంలో అతిధి పాత్రలు పోషించాడు. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ విడుదల అనంతరం రాజ్ తరుణ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో భవిష్యత్ లో అతిధి పాత్రలను ఒప్పుకోబోనని తేల్చి చెప్పేసాడు.

ఇటువంటి కచ్చితమైన స్టేట్మెంట్ ఇచ్చిన కొద్దీ నెలలకే రాజ్ తరుణ్ మాట తప్పాడు. తమిళంలో జై-అంజలి లు జంటగా నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం బెలూన్ లో ఒక అతిధి పాత్రకు చోటుండగా ఆ చిత్ర దర్శకుడు సినీష్ ఆ పాత్ర కోసం రాజ్ తరుణ్ ని సంప్రదించాడు. తమిళ ప్రజలకు పరిచయం అయ్యే అవకాశం వదులు కోకూడదనుకున్నాడో ఏమో మరి అడిగినదే ఆలస్యం చెన్నై వెళ్లి ఒక్క రోజులో తన అతిధి పాత్ర తాలూకా చిత్రీకరణ పూర్తి చేసుకుని తిరిగి వచ్చేశాడు రాజ్ తరుణ్. బెలూన్ పేరుతోనే ఈ చిత్రాన్ని తెలుగులోకూడా విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. జై-అంజలి ల జర్నీ సూపర్ సక్సెస్ తో హిట్ కాంబినేషన్ గా పేరు పొందిన వీరి ఆన్ స్క్రీన్ కాంబినేషన్ లో హారర్ సినిమా రాజ్ తరుణ్ కి ఎంత మాత్రం ఉపయోగపడుతుందో చూడాలి.

Similar News