మరోసారి మాట తప్పుతున్న నాగ్‌..!

Update: 2016-03-21 00:17 GMT

'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం తర్వాత నాగ్‌ మైండ్‌సెట్టే మారిపోయింది. ఆ చిత్రం విడుదల సందర్భంగా నాగ్‌ మీడియాతో మాట్లాడుతూ... సంక్రాంతి సీజన్‌లో చాలా చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ నాకు పెద్దగా ఇబ్బందిలేదు. దానికి కారణం నాకు ఎలాంటి థియేటర్ల సమస్య రాదని తెలుసు, నా రేంజ్‌కు కేవలం 600 థియేటర్లు సరిపోతాయి అని స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. కానీ ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించి నాగ్‌ బిజినెస్‌ రేంజ్‌ను మూడింతలు చేసింది. దాంతో మార్చి 25న విడుదలకు ముస్తాబవుతున్న 'ఊపిరి' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఏకంగా రెండువేల థియేటర్స్‌లో విడుదల చేయడానికి పివిపి సంస్థ ప్లాన్‌ చేస్తోంది. కాగా ఈచిత్రం తమిళంలో కూడా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అక్కడ కార్తీకి ఉన్న ఇమేజ్‌ దృష్ట్యా కేవలం 600ల థియేటర్లలో, ఓవర్‌సీస్‌లో 100 థియేటర్లలో మాత్రమే రిలీజ్‌ కానుంది. కానీ నాగ్‌కు ఇప్పుడున్న ఊపు దృష్యా కేవలం 1200ల నుంచి 1300వరకు థియేటర్లలో తెలుగు 'ఊపిరి ' విడుదల కానుంది. మరి తనకు 600థియేటర్లు చాలని ఇదివరకు ప్రకటించిన నాగ్‌ 'ఊపిరి'ని దానికి రెట్టింపు థియేటర్లలో విడుదల చేయడంపై ఎలా స్పందిస్తాడో వేచిచూడాల్సివుంది. ఇక త్వరలో త్రివిక్రమ్‌శ్రీనివాస్‌ దర్శకత్వంలో అల్లుఅర్జున్‌ ఓ చిత్రం చేయనున్నాడని, ఈ చిత్రంలో నాగార్జున కూడా కీరోల్‌ చేయనున్నాడని వార్తలు వస్తున్న తరుణంలో ఈ విషయంపై నాగార్జున స్పందిస్తూ.. తాను ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'నమో వేంకటేశాయ', 'సోగ్గాచే చిన్ని నాయనా' చిత్రం సీక్వెల్‌గా రూపొందనున్న 'బంగార్రాజు' చిత్రాలను మాత్రమే చేస్తున్నానని, బన్నీ సినిమాలో చేస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని తేల్చిచెప్పాడు.

Similar News