మరో బయోపిక్ కోసం రిజిస్టర్ ఐన టైటిల్

Update: 2017-01-03 19:00 GMT

సినిమా పరిశ్రమలో ఒక్కో ప్రాయంలో ఒక్కో తరహా కథలకు ఆదరణ పెరుగుతుంటుంది. సోసియో ఫాంటసీ కథ ఒకటి ఆడితే వరుసగా అదే తరహా కథలు ప్రేక్షకులకు చూపించటానికి సిద్దమైపోతారు నిర్మాతలు. అలానే ఒక్కో సారి ఒక్కో తరహా కథలు జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మక కథలు, ఫామిలీ డ్రామాలు, ప్రేమ కథలు, రివెంజ్ డ్రామాలు, పోలీస్ స్టోరీ లు ఇలా మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా నిర్మాతల కథల ఎంపిక ధోరణి మారిపోతుంటుంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా సాగుతున్నవి బియోపిక్స్. ది డర్టీ పిక్చర్ నుంచి దంగల్ వరకు అనేక జీవిత కథలు వెండితెరపై ఆవిష్కృతమై కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు దక్షిణాదిన ఒక బయోపిక్ కి తెర లెగిసింది.

గత నెలలో కాలం చెంది తమిళనాడు రాష్ట్రాన్ని అనాధగా వదిలేస్తూ స్వర్గస్తులైన అమ్మ జయలలిత జీవిత కథను తెరకెక్కించబోతున్నారు దర్శకరత్న దాసరి నారాయణ రావు. ఆయన తాజాగా ఫిలిం ఛాంబర్ లో 'అమ్మ' అనే పేరుతో టైటిల్ ను రిజిస్టర్ చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్నట్టు సమాచారం. సినీ, రాజకీయ జీవితాలలో మగ వారి ఆధిపత్యానికి ధీటుగా ఎదిగి అగ్ర స్థానానికి చేరి తమిళుల ఆరాధ్య దైవంగా పరిగణించబడ్డ జయలలిత కథ కావటంతో స్వయానా దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించబోతున్నారు. గతంలో ఆయన రీమేక్ చేసిన 'ఎర్ర బస్సు' చిత్రం ఆశించిన ఫలితాల్ని ఇవ్వని సందర్బములో ఆయన స్పందిస్తూ, "ఈ చిత్రంలో ఆక్షేపించదగ్గ అంశాలు ఏమి లేవు. అందరూ చూడదగ్గ కథే. కానీ నా ప్రేక్షకులు థియేటర్లకు రావటం మానేశారు. వారు టెలివిషన్ కి పరిమితమయ్యారు. ఇప్పటి తరం ఆలోచనలు, చిత్రాల పై వారి అంచనాలు వేరు." అని ఎర్ర బస్సు చిత్ర పరాభవానికి కారణాలు అన్వేషిస్తూ ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీయబోయే సినిమాకి కూడా ప్రస్తుతం పరిశ్రమలో విజయవంతమైన దర్శకుడికే అప్పగిస్తానని తెలిపారు దాసరి. కానీ జయలలిత తో ఆయనకీ వున్నా సాన్నిహిత్యం మరియు జయలలిత జీవితంలో ఆయనని అత్యంత ప్రభావితం చేసే సంఘటనలు ఉండటంతో దాసరి అమ్మ చిత్రంతో తిరిగి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

Similar News