మంచు వారికి తప్పని విడుదల కష్టాలు

Update: 2017-02-06 19:30 GMT

మంచు మోహన్ బాబు నట వారసులుగా ఆయన ముగ్గురు సంతానం సినిమాల్లో నటిస్తుండగా వారందరు నటనతో పాటు ఇతర విభాగాలలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారే. మంచు విష్ణు కథానాయకుడిగా నటించటంతో పాటు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ లో సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా, మరియు సింగం 123 చిత్రంతో కథ, కథనం రచయితగా కూడా పరిచయమయ్యారు. మంచు మనోజ్ కూడా నటనతో పాటు ఫైట్స్ కంపోజర్ గాకూడా పలు సినిమాలకి పనిచేస్తుండగా మోహన్ బాబు కూతురు లక్ష్మి మంచు నిర్మాతగా నటి గా, గాయనిగా, టెలివిషన్ యాంకర్గా వివిధ విభాగాలలో దూసుకుపోతుంది. సినిమా పరిశ్రమలో పలుకుబడి వున్న కుటుంబం నుంచి వచ్చిన వారైనప్పటికీ మంచు వారి వారసులకు విడుదల కష్టాలు తప్పటం లేదు.

మంచు మనోజ్ నటించిన ఎటాక్ చిత్రం అనేక వాయిదాల తరువాత గత ఏడాది వేసవిలో విడుదలై పరాజయం చెందగా మంచు లక్ష్మి ముఖ్య భూమికలో కనిపించిన లక్ష్మి బాంబు చిత్రానికి ఇటువంటి విడుదల కష్టాలే ఎదురవుతుండటంతో వరుస వాయిదాలకు గురవుతుంది. మంచు లక్ష్మి కథానాయికగా పలు ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పటి వరకు సరైన సక్సెస్ అందుకోలేకపోవటంతో లక్ష్మి నటించిన సినిమాలకి క్రేజ్ లేకుండా పోయింది. గుండెల్లో గోదారి, దొంగాట వంటి చిత్రాలు లక్ష్మి మంచు నిర్మాణంలోనే తెరకెక్కటంతో కిందామీదా పది లక్ష్మి స్వయంగా విడుదల ప్రణాళికలు రచించి ప్రేక్షకుల ముందుకి తీసుకురాగలిగింది. కానీ ఇప్పుడు బైట నిర్మాణ సంస్థకి చిత్రం చేయటం, పైగా జగపతి బాబు-ప్రియమణి ల కాంబినేషన్ లో సాధ్యం వంటి వైఫల్య చిత్రం తరువాత కార్తికేయ గోపాల కృష్ణ తెరకెక్కించిన చిత్రం కావటంతో లక్ష్మి బాంబు పై ప్రేక్షకులలో ఏమాత్రం అంచనాలు లేకుండా పోయాయి. గత ఏడాది దీపావళికి విడుదల కావలసిన ఈ చిత్రం వాయిదాలు పడుతూ ఈ నెల మూడవ తీరుకుకి విడుదల ఖరారు చేసుకున్నప్పటికీ ఆ రోజుకి కూడా ప్రేక్షకుల ముందుకి రాలేదు. మరి లక్ష్మి బాంబు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి వచ్చి పేలుతుందో..

Similar News