మంచు వారి నిర్మాణంలో నారా వారి నటుడు

Update: 2016-11-25 14:50 GMT

కమర్షియల్ హీరోగా ఎదిగే ప్రయత్నాలు ఇటీవల కొన్ని చేసి ఎదురు దెబ్బ తిన్న హీరో నారా రోహిత్. ఆయన వెండి తెరకు పరిచయమైన బాణం చిత్రం నుంచి ప్రేక్షకులు నారా రోహిత్ ని వైవిధ్య చిత్రాలతో తప్ప వాణిజ్య అంశాల సమ్మేళనంగా తెరకెక్కే రెగ్యులర్ చిత్రాలకు ఊహించుకోలేకపోతున్నారు. తుంటరి, సావిత్రి చిత్రాలు కమర్షియల్ హీరోగా నిలబెడతాయి అని నమ్మి చతికిలపడ్డ నారా రోహిత్ కి ఇటీవల విడుదల ఐన ఎమోషనల్ ఫామిలీ డ్రామా జ్యో అచ్చుతానంద చిత్రం సక్సెస్ పెద్ద ఊరట ఇచ్చింది. నారా రోహిత్ తదుపరి రెండు చిత్రాలు కూడా తుది దశకు చేరుకున్నాయి.

అప్పట్లో ఒకడుండేవాడు చిత్రం విడుదల సిద్ధమవుతుండగా, కథలో రాజకుమారి చిత్రం చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రంలో నారా రోహిత్ చలన చిత్ర కథానాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. అందు వలన అనేకమంది సినిమా ప్రముఖులు గెస్ట్ రోల్స్ పోషిస్తున్నారు. నాగ శౌర్య, అదా శర్మ, మంచు లక్ష్మి ప్రసన్న, శ్రీనివాస్ అవసరాల తమ తమ నిజ జీవిత పాత్రలతో గెస్ట్ రోల్స్ చేస్తుండటం విశేషం. ఈ చిత్రంలో నారా రోహిత్ పాత్ర నటించే చిత్రానికి మంచు లక్ష్మి నిర్మాతగా కనిపించనున్నారు అంట.

మహేష్ సూరపనేని అనే కొత్త దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. చుట్టాలబ్బాయి ఫేమ్ నమిత ప్రమోద్ నారా రోహిత్ సరసన కథానాయికగా మెరవనుంది. ఈ చిత్రానికి బొగ్గరం వెంకట శ్రీనివాస్ నిర్మాత.

Similar News