మంచు లక్ష్మి వేట కి సిద్ధమవుతోంది

Update: 2018-01-08 09:00 GMT

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు వారసులుగా వెండితెరకి పరిచయమైన మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి లలో ఒక్కరు కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ సంపాదించలేకపోవటం గమనార్హం. వీరిలో విష్ణు మరియు లక్ష్మి నటనతో పాటు నిర్మాణ రంగంలో కూడా తమ ప్రయత్నాలు కొనసాగిస్తుండగా మనోజ్ నటనతో పాటు తన చిత్రాలకి స్టంట్ మాస్టర్గా కూడా పనిచేస్తున్నప్పటికీ ఇవేవి వారి కెరీర్ కి కలిసి రావటం లేదు. ఇటీవల వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న లక్ష్మి మంచు కి తన గత చిత్రం లక్ష్మి బాంబు పెద్ద షాక్ నే మిగిల్చింది. అందుకే కొంత విరామం తీసుకుని మరో లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు తో కుస్తీ పడుతోంది.

బాహుబలి చిత్రానికి దర్శకుడు రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన విజయ్ ఎలకంటి అనే కొత్త కుర్రాడికి దర్శకత్వ అవకాశం ఇచ్చి 'వేట' అనే టైటిల్ తో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తుంది లక్ష్మి. ఇప్పటికే ఈ చిత్రం సింహ భాగం చిత్రీకరణ పూర్తి కావటంతో పబ్లిసిటీ ప్రణాళిక ప్రకారం చేయాలని నిర్ణయించుకున్నారు మంచు లక్ష్మి. తనకి అవమానం జరిగేలా ప్రవర్తించిన వారి ని తన వేట తో హతమార్చే రివెంజ్ స్టోరీ ని నమ్ముకుని రిస్క్ చేస్తున్న లక్ష్మి మంచు కి కాలం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

Similar News