బ్రేక్ ఇచ్చిన చిత్రానికి సీక్వెల్ చేయబోతున్న దర్శకుడు

Update: 2017-05-05 06:48 GMT

15 సంవత్సరాల క్రితం 2002 లో రెండే పాత్రలతో సినిమా ని నడిపిన విలక్షణ తీరుతో ప్రేక్షకులని షో చిత్రం ద్వారా ఆకట్టుకున్న దర్శకుడు నీలకంఠ. ఆ చిత్రానికి ప్రముఖ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కార గౌరవం దక్కటంతో పాటు నీలకంఠ స్క్రీన్ ప్లే కి కూడా జాతీయ పురస్కారం లభించింది. అనంతరం నీలకంఠ తెరకెక్కించిన మిస్సమ్మ క్లాస్ ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకోవటమే కాక నాలుగు విభాగాలలో నంది పురస్కారాలు దక్కించుకుంది. తరువాతి కాలంలో వరుసగా మూడు చిత్రాలు ఈ విలక్షణ దర్శకుడికి చేదు జ్ఞాపకాలని మిగల్చగా 2011 లో నక్సలిజపు లక్షణాలలో మంచి చెడుల మధ్య సంఘర్షణని విరోధి చిత్రంలో వెండితెరపై ఆవిష్కరించిన తీరుకి విమర్శకుల ప్రశంసలతో పాటు రెండు విభాగాలలో నంది పురస్కారాలు, మెల్బోర్న్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శన గౌరవం, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శన గౌరవం దక్కించుకుంది ఈ చిత్రం. ఆ ఉత్సాహంతో ఆసక్తికర కథనంతో నీలకంఠ చేసిన మరో గొప్ప ప్రయోగం మాయ విమర్శకుల ప్రశంసల్ని అందుకుని, బాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్షించి ఆ చిత్ర హిందీ రీమేక్ అవకాశాన్ని నీలకంఠ కి తీసుకువచ్చింది కానీ బొంబాయ్ వెళ్లి స్క్రిప్ట్ పనులు చేసిన నీలకంఠ కి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం ఆశించిన రీతిలో సాగలేదు.

ఇప్పుడు తిరిగి తన దృష్టిని తెలుగు సినిమాలపై కేంద్రీకరించిన నీలకంఠ పదిహేను సంవత్సరాల క్రితం తనకి దర్శకుడిగా గుర్తింపు తెచ్చిన షో చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. సెకండ్ షో అనే టైటిల్ తో తెరకెక్కబోయే ఈ చిత్రానికి నటుడు, రచయిత, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ నీలకంఠతో కలిసి స్క్రిప్ట్ పనులలో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల కూడా ఒక ప్రధాన పాత్ర పోషించనున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ చిత్ర కాస్టింగ్ ఫైనల్ చేసి వివరాలు వెల్లడించి సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారట నీలకంఠ.

Similar News