బూతులతో కామెడీ చేయవద్దని హెచ్చరిస్తుంటా

Update: 2017-02-07 21:30 GMT

ఈ మధ్య కాలంలో టెలివిషన్ పై బాగా పాపులర్ ఐన షో అంటే జబర్దస్త్ ఒక్కటేనేమో. అన్ని వయసుల వారు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. టెలివిషన్ లో ప్రసారమయ్యే సమయంలో చూసే తీరిక లేని వారు యూట్యూబ్ లో ఈ జబర్దస్త్ ఎపిసోడ్స్ ని వీక్షిస్తున్నారు. జబర్దస్త్ ఆర్టిస్టుల ప్రతి స్కిట్ కి అధిక సంఖ్యలో వ్యూస్ దక్కుతున్నాయి. అయితే అదే స్థాయిలో జబర్దస్త్ స్కిట్లపై విమర్శలతో నిండిన కామెంట్స్ కూడా దర్శనమిస్తున్నాయి. హాస్యం పండించటానికి అసభ్యకరమైన పాద జాలం వాడుతూ జబర్దస్త్ ఆర్టిస్టులు స్కిట్లు చేస్తున్నారని ఇప్పటికే ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ఈ కార్యక్రమంలో స్కిట్స్ లలో వినిపించే సంభాషణల్లో ఎలాంటి మార్పు కనపడటం లేదు.

కొణిదల నాగ బాబు, రోజా వంటి సీనియర్ ఇండస్ట్రీ ప్రముఖులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న కార్యక్రమంలో ఇటువంటి అసభ్యకరమైన పదజాలంతో కూడిన స్కిట్లు చోటు చేసుకోవటం విచారకరం. ఇదే విషయం పై న్యాయ నిర్ణేతలలో ఒకరైన నాగ బాబు ని ప్రశ్నిస్తే, "జబర్దస్త్ కార్యక్రమం కేవలం ప్రేక్షకులని నవ్వించటానికి చేస్తున్నది. అంతే తప్ప ఈ స్కిట్లలో వాడే సంభాషణలలో ద్వితీయార్ధాలతో, బూతులతో ఎవరినీ విసిగించే ప్రయత్నం కాదు. అటువంటి అసభ్యకరమైన పదాలు ఇబ్బందికరంగా ఉంటుండటం వాస్తవమే. అయితే స్కిట్ నడిచే ఫ్లో లో నేను అవి వేలెత్తి చూపలేను. అందుకే ఆఫ్ కెమెరా ఆర్టిస్టులని పిలిచి అభ్యంతరకరమైన సంభాషణలు, చేష్టలు స్కిట్లలో చేర్చవద్దంటూ వారిస్తుంటాను. ఇలా వారించినా ప్రతి సారి రెండు మూడు ఎపిసోడ్స్ బాగా సజావుగా ఇబ్బంది లేకుండా సాగుతుంటాయి. తరువాత మళ్లీ దారి తెప్పుతుంటాయి. అందుకే ప్రతి ఐదారు ఎపిసోడ్స్ కి ఒక సారైనా హెచ్చరింపులు తప్పకుండా జరుగుతుంటాయి." అని జబర్దస్త్ ఆర్టిస్టులపై తన వైఖరిని తెలియజేసారు నాగ బాబు.

Similar News