బాలీవుడ్ బాద్షా బొంబాయి నుంచి ఢిల్లీకి రైల్ లో

Update: 2017-01-24 02:28 GMT

బాలీవుడ్ సినిమాలకి హాలీవుడ్ సినిమాలకి మధ్య ప్రణాళికలలో చాలా దగ్గరి పోలికలు కనిపిస్తుంటాయి. సినిమా కి కొబ్బరికాయ కొట్టిన రోజునే గుమ్మడికాయ కొట్టే రోజుని ప్రకటించేస్తారు బాలీవుడ్ మరియు హాలీవుడ్ చిత్ర నిర్మాతలు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయిపోయి ఫస్ట్ కాపీ సిద్దమైన రోజు నుంచి కనీసం రెండు నెలల వ్యవధిని ప్రచారానికి కేటాయించుకుని సినిమా పూర్తి స్థాయిలో ప్రేక్షకులలోకి తీసుకెళ్లిన తరువాత సినిమాల విడుదలలు వుంటుంటాయి. సినిమా ప్రచారానికి అంతటి ప్రాధాన్యత ఇస్తుంటారు అక్కడి సినీ జనం. ఈ నెల 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన రాయిస్ గత మూడు నెలలుగా ప్రేక్షకుల నోర్లలో నానుతుంది. ఈ చిత్రానికి ఆ స్థాయి ప్రచారం దక్కటానికి కారణం డబ్బింగ్ పనులు పూర్తయిన నాటి నుంచి హీరో షారుఖ్ ఖాన్ నిరంతరాయంగా ప్రచార కార్యక్రమాలలో భాగం అవుతుండటమే. మరో రెండు రోజులలో విడుదల అవుతున్న నేపథ్యంలో రాయిస్ చిత్రానికి వినూత్న రీతిలో ప్రచారం కలిపించే విధంగా ప్రయత్నాలు చేస్తుంది చిత్ర బృందం.

23 జనవరి నాడు రాయిస్ నటీనటులు మరియు సాంకేతిక బృందమంతా కలిసి బొంబాయి నుంచి ఢిల్లీ నగరానికి రైలులో ప్రయాణం చేయనున్నారు. ఈ ప్రయాణంలో వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులతో ముచ్చటిస్తూ రాయిస్ సినిమా అనుభవాలను పంచుకోనున్నారు. బొంబాయి నుంచి ఢిల్లీ కి రైలు చేరే సమయానికి అన్ని భోగీలు చుట్టి రాయిస్ చిత్ర విశేషాలు ప్రయాణికులతో పంచుకునే విధంగా ఒక్కో భోగిలో చిత్ర బృందం ఎంత సేపు గడపాలనేది కూడా ప్రణాళిక ప్రకారమే సాగనుంది. ప్రెస్ మీట్లు పెట్టి, సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టి సినిమా కి ప్రొమోషన్స్ చేసి చేతులు దులిపేసుకోకుండా చిత్ర బృందమంతా రైలు ప్రయాణానికి అంగీకరించి ప్రొమోషన్స్ కి నిర్మాత తో సహకరించటం ఎంతైనా హర్షించదగ్గ విషయమే కదా..

Similar News