ఫేడ్ అవుట్ అయినా ఆదాయం బానేవుంది

Update: 2016-12-05 07:00 GMT

2001 లో విడుదలైన నువ్వు నేను చిత్రం ప్రేమ కథల్లో సృష్టించిన సంచలనం ప్రేక్షకులతో పాటు పరిశ్రమ వర్గాలకు జ్ఞాపకమే. ఆ చిత్రంతో హీరో ఉదయ్ కిరణ్, హీరోయిన్ అనిత, సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్, దర్శకుడు తేజ, నటుడు సునీల్ లకి స్టార్డం తీసుకొచ్చింది. కానీ వారిలో సునీల్ ను మినహాయిస్తే తక్కిన వారెవరు తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్ కెరీర్ ను ఏర్పరచుకోలేకపోయారు. ఆర్.పి.పట్నాయక్, అనిత ఇటీవల మనలో ఒకడు అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించినప్పటికీ ఫలితం లేకపోయింది. హీరోయిన్ అనిత నువ్వు నేను తరువాత శ్రీరామ్, సమురాయ్, నిన్నే ఇష్టపడ్డాను వంటి పలు చిత్రాలలో హీరోయిన్ గా అవకాశం అందిపుచ్చుకున్నప్పటికీ సక్సెస్ వరించలేదు.

వైఫల్యాలు మూటకట్టుకోవటంతో అనిత కు అవకాశాలు తగ్గిపోయి రగడ వంటి చిత్రాలలో కేవలం ఒక సన్నివేశానికి పరిమితమైన పాత్ర కూడా చేసింది. హైద్రాబాద్ కు చెందిన పారిశ్రామిక వేత్త రోహిత్ రెడ్డితో వివాహం అనంతరం అనిత తెలుగు చిత్రాలకు దూరంగా ముంబైలో నివాసముంటుంది. హిందీ సీరియళ్ళలో బిజీ ఆర్టిస్ట్ ఐపోవడమే ఇందుకు కారణం. అనిత నటిస్తున్న ఏ హై మొహబ్బత్ సీరియల్ తో బుల్లి తెరపై స్టార్ స్టేటస్ ను కైవసం చేసుకుంది. తెలుగు చిత్రాలలో నటించే మోస్తరు హీరోయిన్లకు అందే పారితోషికాలు అనితకు హిందీ సీరియళ్ల ద్వారా అందుతుండటంతో తెలుగు సినిమాల కోసం ఎదురు చూడక హిందీ సీరియల్స్తో బిజీ అయిపోయింది. ఆవిడ వయసు కూడా వెండి తెరకు ఎక్కువ బుల్లి తెరకు తక్కువ కావటంతో వెండితెరపై ఓల్డ్ యాక్ట్రెస్ అనిపించుకునే కంటే బుల్లి తెరపై యువ నటిగా వెలుగొందటానికి ఇష్టపడుతున్నట్టుంది అనిత.

Similar News