ప్రభాస్ తదుపరి చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు

Update: 2016-12-22 22:00 GMT

2013 లో మిర్చి చిత్రం భారీ విజయం పొందినప్పటికీ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కు తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఇతర భాషల్లో గుర్తింపు ఉండేది కాదు. కానీ 2015 లో విడుదలైన రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి ది బిగినింగ్ తో మాత్రం ప్రభాస్ కు భారత దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. బాహుబలి ది బిగినింగ్ చిత్రీకరణ దశలో ఉండగానే రన్ రాజా రన్ ఫేమ్ దర్శకుడు సుజిత్ కు బాహుబలి తరువాతి చిత్రం అవకాశం ఖాయం చేసేసాడు ప్రభాస్. రన్ రాజా రన్ 2014 లో అతి తక్కువ వ్యయంతో నిర్మితమై యూ.వి క్రియేషన్స్ వారికి, దర్శకుడు సుజిత్ కి తొలి విజయంతో పాటు పరిశ్రమలో గుర్తింపుని ఏర్పరిచింది.

యూ.వి క్రియేషన్స్ వారు సుజిత్ రెండవ చిత్రానికి కూడా నిర్మాణ బాధ్యతలు చేపట్టడానికి సిద్దపడి ప్రభాస్ కాల్ షీట్స్ దక్కించుకున్న నాటికి ఈ చిత్రం పై ఏ మాత్రం అంచనాలు లేవు. కానీ బాహుబలి విడుదల తరువాత జాతీయ స్థాయిలో ప్రభాస్ కు వచ్చిన గుర్తింపు కారణంగా యూ.వి.క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని మూడు భాషల్లో ఏకకాలంలో నిర్మించటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దాదాపు 100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితం కానున్న ఈ చిత్రానికి స్థానిక సంగీత దర్శకుడిని కాక జాతీయ స్థాయిలో మ్యూజికల్ హిట్స్ అందించిన శంకర్-ఎహసాన్-లాయ్ లను సంగీత దర్శకులుగా ఖరారు చేశారు యూ.వి.క్రియేషన్స్ వారు. ఈ నెల ఆఖరికి బాహుబలి చిత్రీకరణ ముగియనుండటంతో జనవరి నెలలో తదుపరి చిత్రం షూటింగ్ కు సిద్ధపడుతున్నాడు ప్రభాస్.

Similar News