పేర్లతో పాటు పార్టీల జెండా రంగులు కూడా అసలే

Update: 2016-12-22 16:08 GMT

ఎన్నో నిజ జీవిత వాస్తవ గాధలను తెరకెక్కించేటప్పుడు ప్రతి దర్శకుడు చెప్పే ఏకైక అబద్దం చిత్రానికి ప్రారంభానికి ముందే 'ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం. ఎవరిని ఉద్దేశించినవి కావు' అంటూ అందంగా చెప్పేస్తారు. నిజ జీవిత సంఘటనలు తెరపై ఆవిష్కరించే తరుణంలో ఆయా పాత్రలతో కానీ ఘటనలతో కానీ ప్రత్యక్షంగా కానీ లేక పరోక్ష సంబంధం వున్న వ్యక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటుంటారు దర్శకులు. ఇప్పుడు యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వాస్తవ ఘటనల సమూహారం గా తెరకెక్కిన వంగవీటి చిత్రం కోసం. వంగవీటి మోహన్ రంగ రౌడీ నుంచి రాజకీయ నేతగా ఎదిగి శాసన సభ్యుడిగా ఉండగానే హత్యకు గురి కావటాన్ని విద్యార్థి దశలో విజయవాడలో గడిపిన రామ్ గోపాల్ వర్మ తాను చూసింది, పరిశీలనలో తెలుసుకున్నది తెర పై ఆవిష్కరించారు.

గతంలోనూ రక్త చరిత్ర చిత్రం ద్వారా రాయలసీమ ప్రాంతాన్ని అనేక దశాబ్దాలు వెంటాడిన ఫ్యాక్షన్ కక్షల నేపథ్యంలో పరిటాల రవీంద్ర మరియు మద్దెలచేరు సూరి కుటుంబాల మధ్య వైరాన్ని కళ్లకుకట్టినట్టుగా చూపించిన వర్మ ఆ చిత్రంలో నేరుగా ఎక్కడా పరిటాల శ్రీరాములు, పరిటాల రవీంద్ర, సాన బ్రదర్స్, మద్దెలచెరు సూరి, మొద్దు శీను పేర్లను ప్రస్తావించలేదు. ప్రతి పాత్రకు తెర పై ఇతర పేర్లతో పరిచయం ఇచ్చాడు. కానీ రేపు విడుదల కానున్న వంగవీటి ప్రచార చిత్రాలు చూస్తే వంగవీటి రాధా, వంగవీటి రంగ, దేవినేని గాంధీ, దేవినేని నెహ్రు, దేవినేని మురళి ఇలా నిజ జీవిత పాత్రలను అలానే చిత్రీకరించే సాహసం చేసాడు. తాజాగా విడుదల చేసిన మరో ప్రచార చిత్రంలో కులం పేరు ప్రస్తావించనప్పటికీ, ఇరు వర్గాల రాజకీయ పార్టీల జెండాలను అదే రంగులతో చూపించాడు వర్మ. ప్రచార చిత్రాలతో చాలా బోల్డ్ గా తెరకెక్కించాడు అని అనిపించుకున్న వర్మ, వంగవీటి పతాక సన్నివేశాలు ఎలా తీర్చి దిద్దాడో అనే ఆసక్తి ప్రేక్షకులలో ఇంకా పెరిగిపోయింది.

Similar News