పుట్టుమచ్చల వివరాలతో కూడిన సర్టిఫికెట్స్ సమర్పించమని ఆదేశాలు

Update: 2017-02-12 08:47 GMT

తమిళ నటుడు ధనుష్ పుట్ట పూర్వోత్తరాలు పై మద్రాస్ న్యాయస్థానములో నడుస్తున్న కేసు కొత్త మలుపు తీసుకుంది. కొంత కాలం కిందట మధురైకి చెందిన రిటైర్డ్ కండక్టర్ కదిరేశన్-మీనాళ్ దంపతులు ధనుష్ తమ బిడ్డ అని, సినిమాల పై వున్న మోజుతో ఇంటి నుంచి పారిపోయి మద్రాస్ చేరుకున్నాడని, ధనుష్ తమ బిడ్డే అని నిరూపించుకోవటానికి తాము డి.ఎం.ఏ పరీక్షలకైనా సిద్ధమేనని న్యాయ విచారణ జరిపి వృద్దాప్యంలో వున్న తమను ధనుష్ ఆదుకునేలా తీర్పు ఇవ్వవలసిందిగా కదిరేశన్ మద్రాస్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. ఈ పిటిషన్ దాఖలు ఐన కొద్ది రోజులకు ధనుష్ కి కోర్టుకి హాజరై వివరణ ఇచ్చుకోవలసిందిగా నోటీసులు జారీ అవటంతో ధనుష్ తన తరుపు న్యాయ వాది తో వాదోపవాదాలు నడిపిస్తున్నాడు.

ఇప్పటికే పలు వాయిదాలు, వాదనలు, విచారణలు దాటిన ఈ కేసు ఇప్పుడు మద్రాస్ న్యాయ స్థానం కోరిన కొన్ని సర్టిఫికెట్స్ తో కొత్త మలుపు తిరిగింది. ధనుష్ తమ బిడ్డే అని నిరూపించుకోవటానికి ధనుష్ ప్రాధమిక విద్య అభ్యసించిన నాటి పుట్టుమచ్చల వివరాలు కలిగిన సర్టిఫికెట్స్ ని కోర్ట్ వారికి సమర్పించవలసినదిగా ఆదేశించింది. కాగా తదుపరి విచారణకు హాజరయ్యే లోపు కోర్ట్ వారు కోరిన ఆధారాలను కదిరేశన్ దంపతులు సమర్పిస్తారో లేక కస్తూరి రాజా దంపతులు సమర్పిస్తారో వేచి చూడాలి. ఇప్పటికే గత వాయిదాల మధ్య సమయంలో ఈ పిటిషన్ ని ధిక్కరిస్తూ కౌంటర్ పిటిషన్ ని దాఖలు చేసిన ధనుష్ కి న్యాయస్థానం నుంచి పిటిషన్ తిరస్కారంతో చుక్కెదురు ఐయింది. మరి రాబోయే విచారణకి ఎవరిది పై చేయి అవుతుందో?

Similar News