పవర్ స్టార్ సినిమా అవకాశాన్ని తిరస్కరించిన రచయిత

Update: 2017-02-09 08:19 GMT

ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మనం వంటి సూపర్ హిట్ సినిమాలకు సంభాషణలు రచించిన రచయిత హర్ష వర్ధన్, వెండి తెర పై యాక్టర్ గానూ కొనసాగుతూనే మెగా ఫోన్ పట్టటానికి చాలా కాలం క్రితమే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా హర్ష వర్ధన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోయే తదుపరి చిత్రాలలో ఒకటైన వేదలమ్ రీమేక్ కి సంభాషణలు రచించే అవకాశం తలుపు తట్టి పలకరించగా ఆయన దానిని సున్నితంగా తిరస్కరించారట. తన డైరెక్షనల్ డెబ్యూ ఫిలిం పనులలో నిమగ్నమై ఉండగా మరో వైపు పవర్ స్టార్ సినిమాకి స్క్రిప్ట్ చేయటానికి కావలసినంత సమయం కేటాయించలేనని హర్ష వర్ధన్ తన వద్దకి వచ్చిన క్రేజీ ఆఫర్ ని హోల్డ్ లో కూడా ఉంచుకోకుండా తిరస్కరించేశారని తెలుస్తోంది.

ప్రస్తుతం బుల్లి తెరపై ఫేమస్ యాంకర్ శ్రీ ముఖి కథానాయికగా, హర్ష వర్ధన్ మరొక ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రంతోనే హర్ష వర్ధన్ వెండి తెర పై దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రం పై ఇంకా బజ్ మొదలు కాకముందే హర్ష వర్ధన్ కి దర్శకుడిగా తదుపరి అవకాశం కూడా వరించటం విశేషం. యువ హీరో సుధీర్ బాబు కథానాయకుడిగా హర్ష వర్ధన్ దర్శకుడిగా తన రెండవ చిత్రాన్ని తెరకెక్కించటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. కాగా తన బిజీ షెడ్యూల్ కారణంతో తిరస్కరించిన పవన్ కళ్యాణ్ సినిమా స్క్రిప్ట్ అవకాశం ఇప్పుడు సాయి మాధవ్ బొర్రా చెంతకి చేరే ఛాయలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పవర్ స్టార్ నటించిన గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాలకు సాయి మాధవ్ బొర్రా సంభాషణలు అందించిన విషయం విదితమే.

Similar News