పవర్ స్టార్ బడ్జెట్ కేర్ నష్టపోయిన బయ్యర్స్ కోసమేనట

Update: 2017-01-26 03:57 GMT

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగా స్టార్ చిరంజీవి ప్రస్తావన కాసేపు పక్కన పెడితే అగ్ర స్థానం కోసం పోటీలో నిలిచే హీరోలు కచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే. వీరిద్దరూ ప్రతి సినిమాకి ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఎదుగుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే పవర్ స్టార్ పై చేయి సాధిస్తుంటాడు. ట్రాక్ రికార్డ్స్ పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ట్రాక్ రికార్డు అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ సాధించి 75 కోట్ల వసూళ్లు రాబట్టగా, మహేష్ బాబు ట్రాక్ రికార్డు శ్రీమంతుడు 85 కోట్ల రూపాయలు వసూళ్లు చేసింది. కాగా శ్రీమంతుడు కి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ తో పోల్చి చూసుకుంటే లాభాల్లో సింహ భాగం ఓవర్ సీస్ నుంచి సమకూరింది. పవన్ కళ్యాణ్ డిసాస్టర్ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ కూడా 52 కోట్ల రూపాయలు సాధించింది మాత్రం తెలుగు రాష్ట్రాలలో వచ్చిన భారీ ఓపెనింగ్స్ వల్లనే.

పవన్ కళ్యాణ్ స్వయం గా కథ, కథనాలు సమకూర్చిన సర్దార్ గబ్బర్ సింగ్ భారీ అంచనాల మధ్య విడుదలవటం తో పాటు ఫాన్సీ రేట్లకి అమ్ముడుపోవటానికి కారణం గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ మాదిరిగా పవర్ స్టార్ పోలీస్ ఆఫీసర్ రోల్ పైగా ఫుల్ గా మాస్ ఎంటర్టైనర్ కావటం. ఈ చిత్రం 52 కోట్లు వసూళ్లు చేసినప్పటికీ అధిక రేట్లు వెచ్చించి విడుదల హక్కులు కొనుగోలు చేసిన తెలుగు రాష్ట్రాల పంపిణీదారులు చవిచూసిన నష్టాలను తీర్చటానికి మహేష్ బాబు తరహాలో పారితోషికం తిరిగి ఇవ్వనప్పటికీ ఆ నష్టాలను తన తదుపరి చిత్రం కాటమ రాయుడు ని రిజనబుల్ డీల్స్ కి సర్దార్ గబ్బర్ సింగ్ పంపిణీ చేసిన పంపిణీదారులకు విడుదల హక్కులు కలిపించే ఆలోచనతో కాటమ రాయుడు చిత్ర బడ్జెట్ కంట్రోల్ పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాడట పవర్ స్టార్. అందుకే దేవి శ్రీ ప్రసాద్ ని కాక అనూప్ రూబెన్స్ కి సంగీత దర్శకత్వ బాధ్యతలు అప్పగించి చిత్రంలో తన తమ్ముళ్ల పాత్రలకు ముందుగా రాజ్ తరుణ్, విజయ్ దేవరకొండ వంటి పలువురు యంగ్ హీరోల పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ శివ బాలాజీ, కమల్ కామరాజు వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులతో నే ఆ పాత్రలలో నటింపజేస్తున్నారు. అగ్ర కథానాయకులు నిర్మాతల శ్రేయస్సు తో పాటు పంపిణీదారులు, కొనుగోలుదారుల కష్టాలను కూడా పట్టించుకుంటుండటం హర్షించదగ్గ పరిణామమే కదా..

Similar News