పవర్ స్టార్ తన బదులు తన నిర్మాతని పంపాడట

Update: 2017-01-10 19:30 GMT

ఇటీవల జరిగిన మెగా స్టార్ చిరంజీవి కం బ్యాక్ చిత్రం ఖైదీ నెం.150 ప్రీ రిలీజ్ వేడుక కి మెగా ఫామిలీ, మెగా అభిమానులు, పరిశ్రమ ప్రముఖులు, చిరంజీవి సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరూ హాజరై ఘనంగా జరిపారు. గత కొన్ని సంవత్సరాలుగా మెగా ఫామిలీ లోని ఏ ఇతర కథానాయకుడి సినిమా వేడుకలకు హాజరు అవ్వని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని చిరంజీవి ప్రతిష్టాత్మక 150 వ చిత్ర వేడుకకు చిరంజీవి శ్రీమతి కొణిదల సురేఖ స్వయానా వెళ్లి ఆహ్వానించారు. అనేక సందర్భాలలో బహిరంగ వేదికలపైనే తన వదిన సురేఖ తనకు తల్లితో సమానం అని చెప్పటంతో ఈ వేడుక కు ఆవిడ ఆహ్వానాన్ని మన్నించి పవన్ కళ్యాణ్ హాజరు అవుతాడని అందరూ ఊహించారు. మెగా అభిమానులు అయితే ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరు తిరిగి సినిమాలు చేయటంపై ఎలా ప్రసంగిస్తారో అని ఆశగా ఎదురు చూశారు. కానీ పవన్ కళ్యాణ్ గైరుహాజరీ లోనే వేడుక జరిగిపోయింది.

కొణిదల సురేఖ ఆహ్వానించినప్పటికీ పవర్ స్టార్ హాజరు కాకపోవటంతో మెగా బ్రదర్స్ మధ్యన తలెత్తిన రాజకీయ విభేదాలు ఇంకా సమసిపోలేదని ప్రచారం ఊపందుకున్న క్రమంలో ఖైదీ నెం. 150 నిర్మాత రామ్ చరణ్ తేజ్ స్పష్టత ఇచ్చాడు. "నేను తొలి సారి నిర్మాణం చేపట్టి ఇంత దిగ్విజయంగా సినిమా చిత్రీకరణ, ప్రీ రిలీజ్ బిజినెస్ జరపటానికి వెనుక నాతో నిత్యం బాబాయ్ సహకారం తోడు వుంది. చిత్రీకరణ వరకు నేను అన్నీ సక్రమంగానే నిర్వహించినప్పటికీ సినిమా వ్యాపారానికి వచ్చే సరికి పంపిణీదారులు తెచ్చే డీల్స్, థియేటర్ ల ప్రీ బుకింగ్స్ కి చాలా గందరగోళానికి గురయ్యాను. ఈ క్రమంలో బాబాయ్ తన నిర్మాత శరత్ మరార్ ను పంపి అన్నీ పనులు దగ్గర ఉండి సక్రమంగా విడుదల జరిగేలా చూడమని పంపారు. శరత్ మరార్ గారు నాతో గత మూడు వారాలుగా ప్రయాణం చేస్తూ నాన్న 150 వ చిత్రానికి గ్రాండ్ రిలీజ్ దక్కటానికి ఎంతగానో సహకరించారు. బాబాయ్ ఆయన ప్రతినిధిగా శరత్ మరార్ గారినే ప్రీ రిలీజ్ వేడుక కు కూడా పంపటం జరిగింది. నాకు అనుక్షణం బాబాయ్ అండగా నిలిచారు." అంటూ పవర్ స్టార్ తన అన్నయ్య సినిమా గ్రాండ్ విడుదలకు తెర వెనుక చేసిన పరోక్ష సాయాన్ని తెలియజేశాడు రామ్ చరణ్.

Similar News