పబ్లిసిటీ లోపించే సినిమా ఫలితం బెడిసికొట్టిందా?

Update: 2017-02-18 05:27 GMT

గత శుక్రవారం (10 ఫిబ్రవరి) న విడుదలైన ఓం నమో వెంకటేశాయ చిత్రం తొలి వారం వసూళ్లు బాగా నిరాశ కలిగించటంతో సినిమా వైఫల్య కారణాలపై అన్వేషణ మొదలు పెట్టారు అక్కినేని నాగార్జున. ముందుగా ఓపెనింగ్స్ గ్రాండ్ గా లేకపోవటానికి ఇదే నెల 9 న విడుదలైన కమర్షియల్ చిత్రం ఎస్-3 ప్రభావం బి,సి సెంటర్స్ లో బాగా ఉందని అనుకుని సరిపెట్టుకున్న చిత్ర బృందం తొలి వారాంతం అనంతరం సింగం ఊపు తగ్గు ముఖం పట్టాక కూడా ఓం నమో వెంకటేశాయ ఆడుతున్న థియేటర్లలో 40 శాతం ఆక్యుపెన్సీ కరువవడంతో కంగు తిన్నారు. పంపిణీదారులకి ప్రపంచ వ్యాప్త థియేట్రికల్ హక్కులని 33 కోట్ల రూపాయల పై చిలుకు మొత్తానికి విక్రయించగా వారికి నష్టాలు తప్పవని ఇప్పటికే అర్ధమైపోయింది.

భక్తిరస చిత్రాలకు దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు-అక్కినేని నాగార్జున ల కాంబినేషన్ కి మంచి పేరు వుంది. గతంలో వారి కలయికలో వచ్చిన అన్నమయ్య, శ్రీ రామ దాసు వంటి విజయాలు ఓం నమో వెంకటేశాయ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ అంత గ్రాండ్ గా జరగటానికి దోహదపడ్డాయి. అయితే షిరిడి సాయి మిగిల్చిన చేదు అనుభవాల నుంచి ఓం నమో వెంకటేశాయ చిత్రాన్ని తగు జాగ్రత్తలతో తెరకెక్కించామని నాగార్జున పలు మార్లు చెప్పటం, విడుదలకి ముందుగా వేసిన ప్రీమియర్ షో టాక్ అదిరిపోవటంతో వెంకటేశ్వర స్వామి బ్యాక్ డ్రాప్ తో మరో అన్నమయ్య ఖాయం అనుకున్నారంతా. కానీ సినిమా ఫలితం బెడిసి కొట్టటానికి సినిమా ని అన్ని వర్గాల ప్రేక్షకులకు రిజిస్టర్ అయ్యే విధంగా విడుదలకి ముందు పబ్లిసిటీ చేయలేకపోవటం తో భక్తిరస చిత్రంలో నవ రసాలు ఒలికించాలనే తాపత్రయంతో దర్శకేంద్రుడి మార్క్ రొమాన్స్ ని అనుష్క, ప్రగ్య జైస్వాల్ ల పై చిత్రీకరించిన పాటలలో చూపించటం మరొక కారణం అని నిర్ధారణకు వచ్చారు నాగార్జున. గతంలో షిరిడి సాయి ని సినిమాగా కాక డాక్యుమెంటరీ గా తెరకెక్కించి తప్పు చేశామని గ్రహించిన నాగ్ ఓం నమో వెంకటేశాయ విషయంలో ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఇక దర్శకేంద్రుడుతో చేయబోయే తదుపరి చిత్రంలో ఇప్పుడు చేసిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతారని ఆశిద్దాం.

Similar News