పద్దతులలో మెగా స్టార్ ఏకైక వారసుడిలా కనిపిస్తున్నాడే..

Update: 2017-02-01 12:22 GMT

చలన చిత్ర పరిశ్రమలోని ప్రముఖులంతా సినిమా పరిశ్రమ అంతా ఒకే కుటుంబం అని, కళామతల్లి బిడ్డలు అందరూ ఆ కుటుంబ సభ్యులేనని, ఇక్కడ ఎవరి మధ్య విభేదాలు వుండవు అని ఎన్ని సార్లు మీడియా ముందు మాట్లాడినా సినిమా పరిశ్రమలో అంతర్గత కలహాలు, కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు వున్నా మాట వాస్తవమే అని స్టార్ హీరోల చిత్రాలలో వారు పలికే సంభాషణల ద్వారా నిరూపితమవుతుంటుంది. ప్రతి స్టార్ హీరో కచ్చితంగా తన ప్రత్యర్థి వర్గపు హీరో పై పరోక్షంగా పంచ్ డైలాగ్స్ వేయటం సర్వ సాధారణం. ఇలాంటివే మెగా స్టార్ చిరంజీవి కూడా ఇటు సినిమా తో పాటు అటు రాజకీయ ప్రత్యర్థులపై సంధించిన పంచ్ లను ఖైదీ నెం.150 లో నింపినప్పటికీ ఆయన ఆఫ్ స్క్రీన్ అందరితో కలియవిడిగా వుంటూ సాధ్యమైనంత వరకు వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉంటుంటారు. ఇతర స్టార్ హీరోల సినిమా ఫంక్షన్లకు కూడా ఆయన అటెండ్ అవుతుంటారు.

మెగా స్టార్ కి నట వారసులుగా చాలా మంది యువ హీరోలతో కూడిన బ్యాచ్ పరిశ్రమలో రాజ్యమేలుతుండగా వారిలో ఒకరైన సాయి ధరమ్ తేజ్ మాత్రం చిరు కి కేవలం నట వారసుడిగానే కాక పద్దతులలో కూడా వారసుడిలా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పటి వరకు ఇతర యంగ్ హీరోస్ తో ఎంత పోటీ ఉన్నప్పటికీ ఆ పోటీని వైరంలా తీసుకోకుండా ముందుకి సాగుతున్న సాయి ధరమ్ తేజ్ నక్షత్రం చిత్రంలో పాత్ర నిడివి చిన్నదైనప్పటికీ సందీప్ కిషన్ తో కలిసి నటించాడు. అలానే మంచు మనోజ్ నటించిన గుంటూరోడు చిత్ర ఆడియో వేడుకకి హాజరు అయ్యాడు. తాజాగా సాయి ధరమ్ తేజ్ తదుపరి చిత్రం జవాన్ చిత్రీకరణ ప్రారంభానికి తారక్ ని పిలిచి క్లాప్ కొట్టించాడు. గుంటూరోడు ఆడియో వేడుకలో అయితే మెగా అభిమానులకి అంతగా రుచించని మంచు మోహన్ బాబు కి బాల్యం నుంచి అభిమానిని అని కూడా చెప్పాడు. సాయి ధరమ్ తేజ్ పరిశ్రమలో ఎటువంటి వివాదానికి తావివ్వకుండా మెగా స్టార్ చిరంజీవిలా అందరివాడు అనిపించుకుంటున్నాడు. భవిష్యత్ లో స్టార్ ఇమేజ్ పెరిగాక కూడా ఈ కుర్ర హీరో ఇలానే వ్యవహరిస్తే నిజమైన మెగా స్టార్ వారసుడిగా నిలిచిపోతాడు.

Similar News