నేను ఆంద్ర బ్యాంకు కి బినామీని

Update: 2017-02-28 09:37 GMT

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చలన చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాల ప్రయాణం తరువాత మాస్ మహారాజ రవి తేజ నటించిన ఆంజనేయులు చిత్రం ద్వారా నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ వంటి మెగా హీరోలతో పాటు తారక్, రవి తేజలతోనూ సినిమాలు నిర్మించారు బండ్ల గణేష్. ఆయన నిర్మించిన సినిమాలకి మాజీ మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి బండ్ల గణేష్కి సొమ్ము అందుతుంటుందని తీన్ మార్ సినిమా సమయం నుంచి వున్న వార్తని అపోహగా తేల్చిపడేసి, ఆ వార్త ఇంతకాలం ప్రచారంలో ఉండటం వెనుక తన తప్పు ఉందని బండ్ల గణేష్ ఒప్పుకోవటంతో పాటు తన భవిష్యత్తు ఎలా ఉండబోతోందో కూడా ఊహించి కొన్ని ఆసక్తికర పరిణామాలను ఆయన ప్రస్తావించారు.

తాజాగా బండ్ల గణేష్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో బొత్స సత్యనారాయణకు తనకి మధ్య వున్న అనుబంధం గురించి అడగగా, "తీన్ మార్ ఆడియో వేడుకలో నేను మర్డర్ చేసినా నన్ను క్షమించే వ్యక్తి బొత్స సత్యనారాయణ అని నేను ఉద్రేకపూర్వకంగా మాట్లాడటం నా తప్పే. ఇప్పటికీ నేను దానికి మూల్యం చెల్లించుకుంటూనే వున్నాను. నేను ఆయన బినామీని అనే అపోహకు తెర తీసింది ఆ వేడుకలో నా ప్రసంగమే. అయితే ఇప్పుడు నేను ఎవరి బినామినో స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. నేను ఆంద్ర బ్యాంకు కి బినామీని. ఎందుకంటే నా వ్యాపార వ్యవహారాలకు లోన్ నేను ఆ బ్యాంకు నుంచే పొందుతుంటాను. నేను కూడా మంత్రి అయితేనే మరో మంత్రికి నేను బినామీ అనే అపోహ సమసిపోతుందేమో. 2019 లో మా బాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభంజనం సృష్టించటం ఖాయం. జన సేన ప్రభుత్వం స్థాపించటం, నేను శాసన సభకు ఎన్నికై మంత్రిని కూడా అవుతానేమో మా బాస్ కేబినెట్లో. ఎప్పటికైనా లోక్ సభకు పోటీ చేసి గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టి అధ్యక్షా అనాలని వుంది." అంటూ తన రాజకీయ భవిష్యత్తుపై తన ఆశాభావాన్ని వ్యక్తపరిచారు బండ్ల గణేష్.

Similar News