నాపై నిషేధానికి కారణం నాకు కూడా తెలీదు

Update: 2016-11-15 09:44 GMT

తమిళ చిత్ర పరిశ్రమలో నటుడు, నిర్మాత ఐన తెలుగు వాడు విశాల్ తమిళ నిర్మాతల మండలి సభ్యులని ఎదిరించి నిషేధానికి గురయ్యాడు. తాను చేసిన తప్పు ఏంటో తనకి ఇప్పటికి అర్ధం కాలేదు అని వాపోతున్నాడు. మొన్న ఆ మధ్య నడిగర్ సంఘం ఎన్నికలలో అప్పటి నడిగర్ సంఘం అధ్యక్షుడు శరత్ కుమార్ పై భారీ గెలుపును సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు నిర్మాతల సంఘం అవలంబిస్తున్న పద్దతులతో విభేదించి రానున్న జనవరి నెలలో జరగనున్న నిర్మాతల మండలి ఎన్నికలలో పోటీ చెయ్యటానికి సిద్ధం అని సవాలు విసురుతున్నాడు విశాల్.

నడిగర్ సంఘం ఎన్నికలు ముగిసిపోయి విశాల్ విజయం సాధించినప్పటికీ, విశాల్ శరత్ కుమార్ ల మధ్య వున్న వైరం ఆ ఎన్నికలతో ముగిసిపోలేదు. నేటికీ వారి మధ్య మాటల యుద్ధం నడుస్తూనే వుంది. ఇదిలా ఉండగా విశాల్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పైరసీ భూతంపై స్పందిస్తూ పైరసీ అరికట్టలేకపోవటానికి నిర్మాతల మండలి సభ్యుల నిర్లక్ష్యం ప్రధాన కారణమని దీనివలన ఎందరో చిన్న నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శనదారులు నష్టపోతున్నారు అని అభిప్రాయపడ్డారు. అయితే విశాల్ నేటికీ అదే అభిప్రాయంతో వున్నానని వెల్లడిస్తున్నారు. తనపై నిషేధం ఊహించిందే అయినా జరుగుతున్న వాస్తవాన్ని ప్రశ్నించినందుకు నిషేధించటం ఆశ్చర్యానికి గురి చేసింది అని విశాల్ చెప్పాడు.

నడిగర్ సంఘం ఎన్నికలలానే నిర్మాతల మండలి ఎన్నికలలో గెలిచి పైరసీ అరికట్టే చర్యలు తీసుకుని చిన్న నిర్మాతలకు అండగా నిలబడటం ఖాయం అని విశాల్ ని సమర్ధించిన నడిగర్ సంఘం ప్యానెల్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Similar News