నాచురల్ స్టార్ వ్యాఖ్యలలో అంతరార్ధం ఏమిటో?

Update: 2017-01-31 07:39 GMT

ఎవడె సుబ్రహ్మణ్యం చిత్రం నుంచి నాచురల్ స్టార్ నాని నటించిన ప్రతి చిత్రం పంపిణీదారులు, ప్రదర్శకులకు కనీసం బ్రేక్ ఈవెన్ అవుతూ నాని ని మినిమమ్ గ్యారంటీ హీరోని చేశాయి. భలే భలే మగాడివోయి, జెంటిల్ మాన్ చిత్రాలు అధిక లాభాలను తీసుకురాగా, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, మజ్ను చిత్రాలు కొనుగోలుదారులను సేఫ్ జోన్ లో వుంచగలిగాయి. మార్కెట్ పరంగా ఇది నాని కి కలిసొచ్చే అంశం కాగా వరుసగా నాని నటించిన చిత్రాలు ప్రేక్షకాదరణ పొందుతుండటంతో నాని స్టార్ హీరో అయిపోయాడు. సాధారణంగానే స్టార్స్ ఎం మాట్లాడిన భూతద్దంలో పెట్టి చూస్తుంటారు. అలాంటిది స్టార్ స్టేటస్ సంపాదించుకున్న నాని సినిమా వేదికల పై కొద్దిగా నోరు జారితే ఆ మాటలు సంచలనం అయిపోవా??

ఫిబ్రవరి 3 న నాని నటించిన నేను లోకల్ చిత్రం విడుదల కానున్న సందర్భముగా నాని మరియు చిత్ర కథానాయిక కీర్తి సురేష్ వరుసగా సినిమా ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ లో నాని మాట్లాడుతూ, "నన్ను అందరూ సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని వాడివి అంటుంటే చాలా గర్వంగా వుంది. ఆ మాటలు విన్నప్పుడల్లా నా గుర్తింపు నా కష్టార్జితం అని అనిపిస్తుంది. అలానే ఎవరైనా నేను మీ అభిమానిని అని అంటే వారి అభిమానాన్ని నా అభినయం ద్వారానే పొందాను అనే తృప్తి ఉంటుంది. అదే నట వారసుడిని అయితే తండ్రి పై వుండే అభిమానం కొడుకుకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి." అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. నాని ఇంటెన్షనల్ గా అనకపోయినా ఈ వ్యాఖ్యలు ప్రముఖ నటుల వారసులైన స్టార్ హీరోస్ అందరికి గుచ్చుకోవటం ఖాయం. అలానే నేను లోకల్ ఆడియో ఆవిష్కరణ వేడుకలో నిర్మాత దిల్ రాజు తన కష్టానికి మించిన పేరు ప్రఖ్యాతలు పొందుతుంటారని చేసిన వ్యాఖ్య కూడా తీవ్ర దుమారానికి దారి తీసింది.

Similar News