నాగ్ కోసమే వస్తుందా?

Update: 2017-11-24 16:00 GMT

రామ్ గోపాల్ వర్మ - నాగార్జున ల సినిమా పూజ కార్యక్రమాలతో మొదలై పట్టాలెక్కేసింది. సినిమా మొదలుపెట్టినప్పటినుండి 10 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ జరుపుకున్న తర్వాత మళ్ళీ డిసెంబర్ 22 తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని నాగ్ ఎప్పుడో చెప్పాడు. యాక్షన్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ గా ఇంకా ఎవరిని ఫైనల్ చెయ్యలేదు. ముందుగా టబు హీరోయిన్ అన్నారు. కానీ దర్శకుడు వర్మ దాన్ని ఖండించాడు. ఇప్పుడు నాగ్ సరసన అనుష్క ఫైనల్ అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం అనుష్క భాగమతి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా జనవరి 26 న విడుదల డేట్ ప్రకటించారు మేకర్స్. అయితే బాహుబలి తర్వాత ఎటువంటి ప్రాజెక్ట్ కి సైన్ చెయ్యని అనుష్క ఇప్పుడు నాగార్జున కోసం వర్మ సినిమాలో నటిస్తుందని టాక్ వినబడుతుంది. ఎందుకంటే నాగ్ ఫ్యామిలీతో అనుష్క కి విడదీయలేని అనుబంధం ఉంది. నాగార్జున సూపర్ సినిమాతోనే అనుష్క హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. అందుకే నాగార్జున సినిమాలో చిన్న పాత్ర చెయ్యడంనికైనా అనుష్క ఎప్పుడూ రెడీగానే ఉంటుంది.

అయితే ఈమధ్య కాలంలో ఆమె అధిక బరువుతో బాధపడుతూ సినిమాలను పక్కన పెట్టేసి.. ఆ బరువు తగ్గించుకునే ప్రయత్నంలో ఉంది. అందుకే సినిమాలు ఒప్పుకోకుండా గ్యాప్ తీసుకుంది. కానీ ఇప్పుడు నాగార్జున కోసమే వర్మ సినిమాలో నటించడానికి ఒప్పుకుందని అంటున్నారు. ఇకపోతే నాగార్జున ప్రస్తుతం అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన సెట్ లో వర్మ దర్శకత్వంలో షూటింగ్ లో బిజీగా వున్నాడు. అలాగే కొద్దిగా అంటే హలో సినిమా విడుదల వరకు గ్యాప్ తీసుకుని మళ్ళీ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడు నాగ్.

Similar News