నాకు సినిమా లైఫ్ ఇచ్చిన హీరోతో విభేదాలా?

Update: 2016-12-12 07:00 GMT

సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరి చూపు సక్సెస్ పైనే ఉంటుంది. సక్సెస్ వస్తేనే పరిశ్రమలో మనుగడ సాధ్యం. అందుకే ఒక సక్సెస్ ఇచ్చిన టీం నుంచి పదే పదే చిత్రాలు వస్తుంటాయి. అదే తొలి ఎటెంప్ట్ లోనే ఒక కాంబినేషన్ ఫెయిల్ అయిందంటే బలమైన కథ నిర్ధేశిస్తే తప్ప మళ్లీ ఆ కాంబినేషన్ మెటీరియలైజ్ అవటం జరగదు. దానితో ఆ వైఫల్యం చెందిన చిత్రం ఆ చిత్ర బృందంలో తగాదాలకు దారి తీసింది అని ప్రచారం జోరుగా సాగిపోతుంటుంది. అయితే ఇటువంటి ప్రచారాలలో నిజాలు అడుగున ఎక్కడో ఉంటాయి అని దాన్ని తోడి పైకి తీసి పరిశీలించే ఓపిక ఎవరికీ ఉండదు అని, అందుకే అందరూ పైకి తేలే కల్పితాలనే నమ్ముతుంటారు అని వాపోతున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.

కిక్ 2 చిత్రంతో ఘోర పరాజయాన్ని చూసిన సురేందర్ రెడ్డి, సమయం తీసుకుని రీమేక్ కథకి తనదైన ముద్రతో ధ్రువ చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు. ధ్రువ సక్సెస్ ఆస్వాదిస్తూనే కిక్ 2 మిగిల్చిన చేదు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కళ్యాణ్ రామ్ తో విభేదాలు ఏర్పడ్డాయి అనే వార్తలను తీవ్రంగా ఖండించారు. "నాకు దర్శకుడిగా తొలి అవకాశం కలిపించిన నటుడు, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ గారే. మళ్లీ ఆయన నిర్మాణంలో దర్శకత్వం చేసే అవకాశాన్ని ఆయన కిక్ 2 చిత్రం ద్వారా కల్పించారు. అతనొక్కడే విజయం పొందింది. కిక్ 2 వైఫల్యం చెందింది. ఆ రెండు చిత్రాలకి వ్యత్యాసం కేవలం ఫలితం లో మాత్రమే కనపడుతుంది. మేము పడ్డ కష్టం, పెట్టుకున్న ఆశలు, మా మధ్య వున్న అనుబంధం, ఒకరి పనితీరు పై మరొకరికి వుండే విశ్వాసం వీటిల్లో ఏవి కూడా అతనొక్కడే సమయం నుంచి కిక్ 2 వరకు చెదరలేదు. రాబోయే కాలంలో నేను మళ్లీ కళ్యాణ్ రామ్ గారి నిర్మాణంలో పనిచేసినా, లేక ఆయన కథానాయకుడిగా నా దర్శకత్వంలో చిత్రం చేసినా మా అంకితభావంలో మార్పు ఉండదు. విజయాపజయాలు సహజం. వాటి ప్రభావం మానవ సంబంధాల మీద ఉండదు అనేది నా ప్రగాఢ నమ్మకం. పైగా కళ్యాణ్ రామ్ గారి లాంటి నిర్మాతల దగ్గర అటువంటి విభేదాలకు తావే ఉండదు." అని ఆయనను దర్శకుడిగా పరిచయం చేసిన నిర్మాత కళ్యాణ్ రామ్ కు తనకు మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు తలెత్తలేదు అని దుష్ప్రచారాలు వలన తలెత్తే అవకాశం కూడా లేదు అని స్పష్టం చేశారు సురేందర్ రెడ్డి.

Similar News