తోటి ఆర్టిస్ట్ కోసం మీడియా ముందుకు వచ్చింది

Update: 2016-12-27 19:00 GMT

అసలు మీడియా కి గాని, సోషల్ మీడియా లో నెటిజన్లకు కానీ అందుబాటులో ఉండని కథానాయిక ఎవరైనా వున్నారు అంటే ఆవిడ ఒక్క నయనతార మాత్రమే అనటంలో అతిశయోక్తి లేదు. అప్పుడప్పుడు ఆవిడ సాగించే ప్రేమ వ్యవహారాలు లేక సహజీవన వార్తలతో తప్ప నయనతార ప్రత్యక్షంగా మీడియా లో కనపడదు. కనీసం ఆ సహజీవన వార్తలు పుకార్లో నిజమో స్పష్టత ఇవ్వటానికి కూడా నయన్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇక ఆవిడ నటించిన చిత్ర నిర్మాతలకు కూడా ప్రచార సమయాల్లో అందుబాటులో ఉండకుండా ఇబ్బంది పెట్టిన సందర్భాలు అనేకం. నయన్ నటనాభినయం కోసం ఆమె ని అనామిక చిత్రంలో నటింపచేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రచార కార్యక్రమాలకు నయన్ ని ఒప్పించలేక గాయని సునీత తో పబ్లిసిటీ చేపించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు నయన్ ఎవరు పిలవకుండానే మీడియా ముందుకు వచ్చింది. తన తోటి ఆర్టిస్ట్ తమన్నా కు జరిగిన అన్యాయంపై స్పందించి తన మద్దతుని తమన్నాకు తెలపటానికి నయన్ మీడియా ను ఆశ్రయించింది.

సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా వుండే కథానాయికల కంటే ముందుగా తన ఆవేదనను వ్యక్తం చేసిన నయన్ ను అంతగా బాధ పెట్టిన విషయం దర్శకుడు సూరజ్ బహిరంగంగా మీడియా ముందు తమన్నా ను అవమానించటమే. "బాలీవుడ్ లో మేరీకోమ్, మర్దానీ, పింక్, దంగల్ అంటూ కథానాయికలకు గౌరవ స్థానం కలిపిస్తుంటే దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమల్లో మాత్రం దర్శకులు ఆ ప్రయత్నాలు విరివిగా చేయటం లేదు. పైగా దర్శకుడు సూరజ్ తన చిత్రంలో నటించిన కథానాయిక తమన్నా కేవలం అందాల ఆరబోతకే తప్ప చిత్ర కథతో కానీ, నటనతో కానీ ఆవిడకు సంబంధం లేదు అని వ్యాఖ్యలు చేస్తూ పరిశ్రమ వ్యక్తి ఐయి ఉండి కూడా ఒక ఆర్టిస్ట్ ని బహిరంగంగా అవమానిస్తున్నారు. ఇది ఎంత మాత్రం సహించదగ్గ పరిణామం కాదు. అవకాశం ఇవ్వాలే కానీ తమన్నా అనే కాదు ప్రతి కథానాయిక పూర్తి బాధ్యత స్వీకరించి కథానాయకుల కంటే ఎక్కువగా శ్రమించగలరు. ఈ పరిణామం పై తమన్నా స్పందించాలనుకుంటుందో లేదో తన వ్యక్తిగత విషయం. కానీ తమన్నా వెంట నేను నిలబడతాను." అంటూ తమన్నా కు జరిగిన అవమానం పై ఆవేదన వ్యక్తం చేసింది నయనతార.

Similar News