తిరిగి సోషల్ లైఫ్ లోకి మద్రాస్ బ్యూటీ

Update: 2017-02-17 21:30 GMT

గత నెలలో భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పుకి సైతం ఎదురెళ్లి తమ ఆచారం ఐన జల్లికట్టు పై సానుకూల నిర్ణయాన్ని రాబట్టుకున్న తమిళులు త్రిష పై ఇదే విషయంలో ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. పెటా సంఘానికి మద్దతుపలుకుతూ జల్లికట్టుకి వ్యతిరేకంగా త్రిష చేసిన ఒక ట్వీట్ తమిళనాట త్రిష పై వున్న అభిమానం అంతా ద్వేషంగా మార్చేసింది. తమిళులు తమ సాంప్రదాయ క్రీడగా భావించే జల్లికట్టుకి వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తుందన్న నెపంతో త్రిష పై తమ ఆగ్రహాన్ని వ్యక్తపరచటానికి ఆమె దిష్టి బొమ్మలు దహనం చేయటంతో పాటు త్రిష మరణించినట్టు ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. జన్మ దిన వివాదాలతో పాటు మరణ తేదీ ని పెట్టి త్రిష ఫోటోకి నివాళులర్పిస్తూ తమిళులు సోషల్ మీడియాలో నిరసన తెలపటంపై త్రిష ఆవేదన చెంది తన ట్విట్టర్ అకౌంట్ ని తాత్కాలికంగా నిలిపి వేసింది.

జల్లికట్టు వివాదం ముగియటంతో సరిగ్గా నెల రోజుల అనంతరం త్రిష తన ట్విట్టర్ అకౌంట్ ని రీ ఓపెన్ చేసి ప్రేమికుల రోజు ని పురస్కరించుకుని ఈ నెల 14 న తన తదుపరి చిత్రాల వివరాలతో పాటు 96 పోస్టర్ ని పోస్ట్ చేసింది. ఇక ఇవాళ విడుదల కాబోతున్న ఘాజి పై ట్వీట్ చేసిన త్రిష రానా దగ్గుబాటి ని తనకి ఘాజి సినిమా ఎప్పుడు చూపిస్తావు అంటూ ప్రశ్న వేసింది. మరోవైపు జయలలిత వీరాభిమాని ఐన త్రిష ని ట్విట్టర్ లో తన ఫాలోయర్స్ తమిళనాడు ముఖ్యమంత్రిగా అమ్మ తదనంతరం శశికళ, పన్నీర్ సెల్వం, పళని స్వామిలలో ఎవరు అర్హులు అని మీరు భావిస్తున్నారని వరుసగా ప్రశ్నిస్తుండగా జల్లికట్టు వివాదంలో తలెత్తిన ప్రమాదాల నుంచి కూడగట్టుకున్న అనుభవంతో లౌక్యం ప్రదర్శిస్తుందే తప్ప ప్రస్తుత తమిళ రాజకీయ పరిణామాలపై తన స్పందనని మాత్రం తెలుపకుండా దాటవేస్తోంది త్రిష.

Similar News