తమ్ముడి ‘ఫిఫ్టీడేస్’ కోసం అన్న త్యాగం చేశాడా?

Update: 2016-10-17 09:23 GMT

సినిమా విడుదల తేదీని ప్రకటించిన తర్వాత.. దాన్ని మార్చుకోవడం అంటే అందులో చాలా సెంటిమెంట్లు ముడిపడి ఉంటాయి. కానీ నందమూరి కల్యాణ రామ్ మాత్రం అవేవీ ఖాతరు చేయలేదు. ఆ సెంటిమెంట్ల కంటె కూడా తన తమ్ముడి సినిమా సాదించే రికార్డే ముఖ్యమని అనుకున్నాడు. అందుకే చిన్న త్యాగం చేశాడు. విడుదల తేదీని మార్చుకున్నాడు.

అవును ఇదంతా ‘ఇజం’ సినిమా విడుదల గురించే. నందమూరి కల్యాణరామ్ స్వయంగా నిర్మిస్తూ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందించిన ‘ఇజం’ ఈ నెల 20వ తేదీన గురువారం విడుదల కావాల్సి ఉంది. అదే రోజున జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలి చిత్రం ‘జనతా గ్యారేజ్’ ఫిఫ్టీ డేస్ కు చేరుకుంటుంది. ఇజం విడుదల కావాలంటే.. రాష్ట్రంలో చాలా థియేటర్లలో జనతా గ్యారేజ్ ను ఎత్తేయాల్సి వస్తుంది. ఫిఫ్టీ డేస్ సింగిల్ థియేటర్ అనే రికార్డుకు రూపు మారిపోతుంది.

ఆ నేపథ్యంతో కల్యాణరామ్ తన సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకున్నారు. 20కి బదులుగా 21వ తేదీన ఇజం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సో, నందమూరి అభిమానులకు గురువారం జనతా గ్యారేజ్ ఫిఫ్టీడేస్, శుక్రవారం ఇజం విడుదల రెండు పండుగల పక్కపక్కనే వస్తాయన్నమాట.

Similar News