తమిళ్ ఆఫర్స్ కూడా తలుపు తడుతున్నాయే

Update: 2016-12-14 05:40 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుత ట్రెండీ హీరోయిన్ గా వరుస స్టార్ హీరోస్ సినిమాలతో దూసుకుపోతున్న కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఏడాది నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ చిత్రాలతో స్టార్ హీరోస్ సరసన నటించి హ్యాట్రిక్ విజయాలతో 2016 కు వీడ్కోలు పలుకుతున్న ఏకైక తెలుగు హీరోయిన్ కూడా రకుల్ మాత్రమే. రానున్న 2017 లోనూ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఒక చిత్రం, సాయి ధరమ్ తేజ్ సరసన విన్నర్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడిగా మరో చిత్రం తో వచ్చే ఏడాది కూడా సందడి చేయనుంది. మరో పక్క రకుల్ తమిళ పరిశ్రమ నుంచి వచ్చిన విశాల్ చిత్రంలో ఆఫర్ ని డేట్స్ సర్దుబాటు చేయలేక తిరస్కరించగా ఇప్పుడు మరో క్రేజీ తమిళ ఆఫర్ రకుల్ తలుపు తట్టింది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో వున్న వినోద్ దర్శకత్వంలో కార్తీ హీరో గా తెరకెక్కనున్న చిత్రానికి ఇప్పటికే చిత్ర బృందం రకుల్ ప్రీత్ సింగ్ తో సంప్రదింపులు జరిపారు అంట. అయితే ఫిబ్రవరి కి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతున్న ఈ చిత్రానికి రకుల్ ఇంకా అంగీకారం తెలుపలేదు. తాను చేస్తున్న తెలుగు చిత్రాల చిత్రీకరణల మధ్యలో వెసులుబాటు చూసుకుని కార్తీ సినిమా చేస్తుందో లేక గతంలో విశాల్ చిత్రం తిరస్కరించినట్టే తిరస్కరిస్తుందో చూడాలి. కార్తీ కి తెలుగులో సుస్థిరమైన మార్కెట్ ఉండగా, తెలుగులో ప్రముఖ కథానాయిక అయిన రకుల్ ఈ చిత్రంలో నటిస్తే అదనపు వ్యాపార బలం అవుతుంది అని ఆశపడుతున్నారు నిర్మాతలు.

కెరీర్ తొలి దశలో తదైయారా తక్క, పుత్తగం, ఎన్నాయో ఏదో వంటి తమిళ ప్రయత్నాలు చేసినప్పటికీ తెలుగులో వచ్చిన గుర్తింపు రకుల్ కి తమిళంలో రాలేదు. మరి ఇప్పుడు వచ్చింది కార్తీ చిత్రంలో కాబట్టి సినిమా ఒప్పుకుంటే ఆ లెక్క వేరుగా ఉండొచ్చు.

Similar News