టీజర్ కించపరిచిందని దర్శకుడిని అరెస్ట్ చేశారు

Update: 2017-01-20 05:54 GMT

ఈ ఆధునిక కాలంలో మానవతా విలువలు నశించిపోతున్నప్పటికీ మనోభావాలు దెబ్బతినటం, భావోద్వేగాలను కించపరచడం అనే పెద్ద పెద్ద మాటలు మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. అందరికి కామన్ గా వుండే ఫోకస్ సినిమా మీదే కావటంతో ఇందుకు ఎక్కువ నష్టపోతుంది సినిమా పరిశ్రమ వాళ్ళే. దాదాపుగా ప్రతి అగ్ర కథానాయకుడి చిత్రాన్ని, లేదా ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించిన చిత్రాలపై మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలు వున్నాయంటూ ఆరోపణలు చేస్తూ మీడియా ద్వారా పబ్లిసిటీ పొందుతున్నవారు అనేకమంది వున్నారు. ఇటీవలి కాలంలో విడుదలైన 'ద్యేవుడా' చిత్ర టీజర్ ప్రేక్షకులని అమితంగా ఆశ్చర్య పరచటంతో ఆ చిత్ర దర్శక నిర్మాతలపై పలు అభియోగాలు మోపుతూ పోలీస్ కేసు నమోదు చేశారు భజరంగ్ దళ్ కి చెందిన నవీన్ అనే వ్యక్తి.

'ద్యేవుడా' టీజర్ లో శివుడి ని ఆరాధించే కొందరు మద్యం మరియు కాల్చిన పొగాకు తో శివుడి సేవ చేయటం పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శివుడి పూజ ను ఇంత హీనస్థాయికి దిగజార్చటంతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ 'ద్యేవుడా' చిత్ర దర్శకుడు దాసరి సాయి రామ్, నిర్మాత గజ్జెల హరికుమార్ రెడ్డి పై కేసు నమోదు చేశారు నవీన్. ఈ కేసు పరిశీలనలో భాగంగా యూట్యూబ్ లో ప్రత్యక్షమైన టీజర్ ని వీక్షించిన పోలీస్ సిబ్బంది ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చేయటంతో పాటు దర్శకుడు దాసరి సాయి రామ్ ని అదుపులోకి తీసుకున్నారు. నిర్మాత హరికుమార్ రెడ్డి పరారీలో వున్నారు. పోలీస్ వారు ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో, "ఆ సన్నివేశాలు ఎవరిని కించపరచటానికి చేసినవి కాదు. కర్ణాటక రాష్ట్రంలోని ఉజ్జయిని లోని దేవాలయం లో మద్యం మరియు సిగరెట్లతో శివునికి పూజ చేయటాన్ని చూసి స్ఫూర్తి పొంది ఆ సన్నివేశాలు చేసాము." అని దర్శకుడు సాయి రామ్ వివరణ ఇచ్చినట్టు సమాచారం.

భజరంగ్ దళ్ సభ్యుడు నవీన్ తన మనోభావాలు దెబ్బతింటే అతని హక్కు ప్రకారం చట్ట పరమైన చర్య కి తావివ్వటంలో అభ్యంతరం ఉండబోదు కానీ, సినిమా విడుదల వరకు ఆగి అసలు ఆ దర్శక రచయితలు ఏమి చెప్పదలచుకున్నారో తెలుసుకున్నాకా నిర్ణయం తీసుకుని ఉండి ఉంటే బావుండేదేమో!

Similar News