టాప్ స్టార్స్ ని ఖంగుతినిపించిన 2016

Update: 2017-01-01 08:08 GMT

ఈ ఏడాది తెలుగు సినిమా పరిశ్రమకు మాంచి ఎనర్జీ కిక్ స్టార్ట్ ని అందించింది ఎనెర్జెటిక్ హీరో రామ్ నటించిన నేను శైలజ చిత్రం. తరువాత సంక్రాంతి పండుగకి వచ్చిన బడా హీరోల సినిమాలు నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్ని నాయనా, ఎక్ష్ప్రెస్స్ రాజా చిత్రాలు విజయాలు నమోదు చేయగా డిక్టేటర్ చిత్రం యావరేజ్ గా నిలిచింది. అలానే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సుప్రీమ్, నాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, జెంటిల్ మెన్ చిత్రాలు అంచనాలను అందుకున్నాయి. మరో వైపు చిన్న చిత్రాలలో క్షణం, పెళ్లి చూపులు భారీ విజయాలు అందుకోగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో అక్కినేని నాగ చైతన్య ప్రేమమ్, వెంకటేష్ బాబు బంగారం చిత్రాలు ఎబోవ్ యావరేజ్ గా నిలిచాయి. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు, యంగ్ టైగర్ తారక్ జనతా గ్యారేజ్ వారి కెరీర్లలో ట్రాక్ రికార్డ్స్ గా నిలిచాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా వరుస పరాజయాల నుంచి ధ్రువ చిత్రం ద్వారా బైట పడ్డారు. ఇక డీమానెటైజెషన్ ఎఫెక్ట్ లోనూ భారీ విజయం సాధించిన యంగ్ హీరో నిఖిల్ నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం పరిశ్రమ మొత్తానికి ఆదర్శంగా నిలిచి తదుపరి వారాల్లో ధైర్యంగా నిర్మాతలు విడుదలలు ప్లాం చేసుకోవటానికి దోహద పడింది.

మొత్తం మీద గత ఏడాది మీద ఈ ఏడాది తెలుగు సినిమాల సక్సెస్ రేట్ మెరుగు పడింది. కానీ 2016 టాలీవుడ్ ఇద్దరు టాప్ హీరోలకూ చుక్కలు చూపించింది. ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి స్వయానా ఆయనే కథ, కథనాలు రచించుకోగా ఆ చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదలై ఘోర పరాజయం చవి చూసింది. పవర్ స్టార్ ఈ ఏడాది ఇచ్చిన భారీ డిసాస్టర్ విడుదలైన మరుసటి నెలలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం విడుదలైయ్యింది. దర్శకుడు అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విజయం తరువాత వారి కలయిక లో భారీ తారాగణంతో తెరకెక్కిన చిత్రం కావటంతో బ్రహ్మోత్సవం పై అంచనాలు తారా స్థాయికి చేరాయి. కానీ ఆ చిత్రం మహేష్ బాబు కెరీర్ లో బాబీ, నాని, సైనికుడు, ఆగడు వంటి డిసాస్టెర్స్ జాబితాని కొనసాగింపుగా మిగిలిపోయింది.

2016 ఇచ్చిన జలక్ నుంచి త్వరగా తేరుకున్న ఇద్దరు స్టార్స్ రానున్న ఏడాదిలో రెండేసి విడుదలలు ప్లాన్ చేస్తున్నారు. మురగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న చిత్రం తో పాటు కొరటాల శివ చిత్రం కూడా 2017 లోనే విడుదల కానున్నాయి. పవర్ స్టార్ నటిస్తున్న కాటమరాయుడు చిత్రంతో పాటు తమిళ వేదాళం రీమేక్ కూడా రానున్న ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ ఇద్దరు టాప్ హీరోస్ కి 2017 కలిసి వస్తుందని ఆశిద్దాం.

Similar News