చెర్రీ స్వప్నంపై ‘నోటుదెబ్బ’ పడుతుందా?

Update: 2016-12-05 08:14 GMT

తుఫాన్, గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ లతో వరుసగా బాక్సాఫీస్ అంచనాలు అందుకోలేకపోయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ధ్రువ చిత్రంతో ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని తెగ తాపత్రయ పడుతున్నాడు. కానీ మార్కెట్ అందుకు అనుకూలిస్తుందో లేదో తెలియటానికి తొలి పరీక్ష రామ్ చరణే ఎదుర్కోనున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల చర్య సినిమా పరిశ్రమకు ముప్పు కాబోదు అని కొందరు నిర్మాతలు తొలుత ధీమా వ్యక్తం చేసినప్పటికీ సాహసం శ్వాసగా సాగిపో ఫలితంతో ఈ చర్య సినిమా పరిశ్రమపై ఎంతటి దుష్ప్రభావం చూపనుందో అందరికి స్పష్టత వచ్చేసింది. పరిస్థితి కొంత కుదుట పడిన తరువాత నెమ్మదిగా విడుదలలు జరుగుతున్నాయి.

కరెన్సీ కష్టాలతో సతమతమవుతున్న సగటు ప్రేక్షకుడు యువ హీరో నిఖిల్ నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా ని ఆదుకున్నప్పటికీ మల్టీప్లెక్సలలో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టి ఇతర కేంద్రాలలో మోస్తరు వసూళ్లు సాధించింది. మల్టీప్లెక్స్‌లలో నగదు రహిత టికెట్ కొనుగోళ్లు జరుగుతుంటాయి కాబట్టే ఇది సాధ్యమైంది అని నిపుణుల అంచనా. అయితే ఈ పరిస్థితి రామ్ చరణ్ తేజ్ వంటి పెద్ద హీరో చిత్రానికి పైగా భారీ వ్యయంతో నిర్మితమైన ధ్రువ కు ఎంత వరకు దోహదపడొచ్చు అనేది ప్రశ్నార్ధకమే. రిపీటెడ్ ఆడియన్స్ వుండే అవకాశం తగ్గటంతో భారీ వసూళ్లు సాధ్యపడని పరిస్థితి నెలకొనవచ్చు. కరెన్సీ కష్టాల నేపథ్యంలో రూరల్ ప్రాంత థియేటర్లలో సగటు ప్రేక్షకుడు ఒకసారికి మించి చిత్రాన్ని చూసే అవకాశం లేదు.

అయితే చిత్రం ఆడటానికి ఆడకపోవటానికి కేవలం కరెన్సీ అందుబాటులో లేకపోవటమే కారణం అని నిర్దారించటం కుదరదు. చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాల బలం బలహీనతలపైనా సినిమా బిజినెస్ ఆధారపడుతుంది కాబట్టి ధ్రువ ఫలితం ఊహకు అందని విడ్డూరం లానే వుంది ట్రేడ్ అనలిస్టులకు కూడా.

Similar News