ఘాజి కి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ అర్హతని కలిపిస్తాయా?

Update: 2017-02-24 02:28 GMT

2015 లో గుణశేఖర్ దర్శకత్వం లో తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవి కి వరంగల్ ప్రాంత బ్యాక్ డ్రాప్ లో జరిగిన చరిత్రకి వెండితెర రూపం ఇచ్చినందుకు ప్రశంసిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు రుద్రమదేవి చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చి ప్రోత్సహించారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగకి విడుదలైన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం తెలుగు వారు గుర్తించని తెలుగు యోధుడి చరిత్ర కావటంతో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ఇచ్చి గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని ప్రోత్సహించటంతోపాటు పరోక్షంగా బయ్యర్స్ కి చాలా మేలు చేశాయి.

తాజాగా తెలుగు, హిందీ, తమిళ భాషలలో విడుదలైన ఘాజి చిత్రం కమర్షియల్ మీటర్ కి దూరంగా భారత-పాక్ దేశాల మధ్య జరిగిన సబ్ మెరైన్ యుద్ధపు ఉదంతాన్ని వెండితెరపై ఆవిష్కరించి చరిత్రలో భాగమైన యుద్దాన్ని ప్రేక్షకులకు చూపించి ప్రశంసలతోపాటు కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. అయితే చారిత్రాత్మక నేపధ్యం వున్న చిత్రం కావటంతో నిర్మాతలైన మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ మరియు పీవీపీ ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు పన్ను మినహాయింపు ఇవ్వమని విన్నపిస్తూ లేఖ రాసారు. ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఆంద్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అర్జీ ని పరిశీలనలో ఉంచినట్టు సమాచారం. మరి ఘాజి కి పన్ను మినహాయింపు దక్కి బయ్యర్స్ కి ఓవర్ ఫ్లో వసూళ్లు దక్కుతాయో లేదో చూడాలి.

Similar News