కోలీవుడ్ లో హీరో విశాల్ కొత్త వివాదం

Update: 2016-11-14 16:25 GMT

కోలీవుడ్ లో తనకంటూ గుర్తింపు క్రేజ్ సంపాదించుకున్న తెలుగు కుర్రాడు, ఉభయ భాషా చిత్రాలు రెగ్యులర్ గా తీస్తున్న హీరోగా చెలామణీ అవుతున్న వ్యక్తి విశాల్. విశాల్ సినిమాలు ప్రతిదీ తెలుగులో కూడా విడుదల అవుతూ ఉంటాయి. కానీ తమిళ హీరోగానే విశాల్ మీద ముద్ర ఉంటుంది. కేవలం నామ్ కే వాస్తే హీరోగా చెలామణీ కావడం కాదు. అక్కడ కోలీవుడ్ సినీనటుల సంఘానికి కూడా విశాల్ నాయకుడు. అక్కడ ఎంతో సీనియర్ అయిన శరత్ కుమార్ తో విభేదించి తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకుని.. నటుల వర్గాల గొడవల్లో నిత్యం తలమునకలుగా ఉండే వ్యక్తి విశాల్.

అలాంటి హీరో విశాల్ ఇప్పుడు మరొక కొత్త వివాదంలో చిక్కుకున్నట్లుగా కనిపిస్తోంది. తను హీరోగా చేసే చిత్రాలకు తనే నిర్మాతగా కూడా వ్యవహరించే హీరో విశాల్ కు సహజంగానే తమిళ చిత్ర నిర్మాతల మండలిలో కూడా సభ్యత్వం ఉంది. అయితే నిర్మాతల మండలి హీరో విశాల్ ను బహిష్కరిస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది. దీంతో నిర్మాతల మండలిలో విశాల్ చుట్టూ కొత్త వివాదం మొదలైనట్లుగా కనిపిస్తోంది.

తనను నిర్మాతల మండలి నుంచి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందని హీరో విశాల్ చెబుతున్నారు. అయితే తాను ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తానని అంటున్నారు. విశాల్ ను బహిష్కరించడానికి గల కారణాలను నిర్మాతల మండలి ఇంకా ప్రకటించలేదు. కారణాలు వాటంతట అవి కూడా వెలికి రాలేదు. అయితే విశాల్.. తమిళ సినీనటుల సంఘం నడిగర సంఘం లో సంచలనాలు సృష్టించినట్లే, నిర్మాతల మండలిలో కూడా ప్రకంపనాలు తేగలడని పలువురు అనుకుంటున్నారు.

Similar News