కోలీవుడ్ పన్ను రాయితీలకు కోర్టు దెబ్బ

Update: 2016-12-13 05:12 GMT

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో తమిళ భాషలో రూపొందే చిత్రాలకు పన్ను రాయితీ కలిపించి సినిమాల ద్వారా తమిళ భాష ప్రాచుర్యాన్ని ప్రచారం చేసే విధంగా 2006 లో ఒక తీర్మానం ప్రవేశపెట్టి చిత్ర పరిశ్రమకు చేయూత నిచ్చింది. అయితే ఆ తీర్మానంలో కొన్ని షరతులు విధించి ఆ షరతులు ఉల్లంఘించని చిత్రాలకు మాత్రమే పన్ను రాయితీ కల్పించే దిశగా ప్రభుత్వం ప్రణాళిక రచించింది. వాటిలో ముఖ్యంగా తమిళంలో రూపొందే చిత్రాలకు తమిళ పేరు ఉంటేనే పన్ను రాయితీ లభిస్తుంది. అయితే ప్రస్తుత చిత్రాలలో కేవలం తమిళ పేరు ప్రాతిపదికనే ఈ పన్ను రాయితీ మంజూరి కలిపిస్తూ ఇతర షరతులన్నీ గాలికి వదిలేయడంతో మద్రాస్ హై కోర్ట్ తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

హింసను ప్రేరేపించే సన్నివేశాలు వున్నా చిత్రాలకు కూడా యూ సర్టిఫికెట్ ఎందుకు ఇస్తున్నారు. ఒకవేళ సెన్సార్ బోర్డు సభ్యులు ఆ తప్పిదానికి పాల్పడితే అటువంటి చిత్రాలకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పన్ను రాయితీ ఎందుకు కల్పిస్తుంది? కేవలం తమిళ పేరుతో తెరకెక్కితే ఆ చిత్రాల ద్వారా భాష ప్రాచుర్యం పొందుతుందా? ఇటువంటి పలు ఆసక్తికర ప్రశ్నలు తమిళనాడు ప్రభుత్వంపై సంధించింది. సెన్సార్ బోర్డు వారి నియమ నిబంధనలపై కూడా మద్రాస్ హై కోర్ట్ ప్రశ్నించింది.

హై కోర్ట్ తీరుకి కంగుతిన్న ప్రభుత్వం సెన్సార్ బోర్డు పై ఇక నుంచి కఠినంగా ఉండనుంది. క్లీన్ యూ సర్టిఫికెట్ పొందిన చిత్రాలు తమిళ పేరు కలిగి ఉన్నప్పటికీ ఇక నుంచి పన్ను రాయితీ దక్కించుకోవాలంటే హై కోర్ట్ తాజాగా సమర్థించిన నియమ నిబంధనలు కూడా పాటించాల్సి ఉంటుంది. దీనితో ఇక తమిళంలో ఆర్ట్ చిత్రాలకు తప్ప ఇతర చిత్రాలకు పన్ను రాయితీ దక్కే అవకాశం ఉండదు అనే అభిప్రాయలు కూడా వినపడుతున్నాయి.

Similar News