కోలీవుడ్, టాలీవుడ్ లో బ్లాక్బస్టర్... ఇప్పుడు బాలీవుడ్ కి

Update: 2017-02-27 08:50 GMT

తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్.మురగదాస్ దర్శకుడిగా తుపాకీ వంటి ఘన విజయం తరువాత అదే కాంబినేషన్ లో కత్తి చిత్రం రూపొందగా తమిళ ప్రేక్షకులు ఆ చిత్రానికి బ్రహ్మ రథం పట్టిన సంగతి విదితమే. అయితే ఆ చిత్రాన్ని తెలుగులోకి అనువదించాలని ముందుగా అనుకున్నప్పటికీ తెలుగు కథానాయకులైన పవన్ కళ్యాణ్, తారక్ లు ఆ కథపై మోజు పడటంతో కత్తి రీమేక్ అవుతుందనే ప్రచారం దాదాపు రెండు సంవత్సరాల క్రితమే మొదలైయ్యింది. కానీ వారిద్దరూ తరువాత ఈ కథని పక్కన పెట్టేయటంతో అనూహ్యంగా కత్తి చిత్రం మెగా స్టార్ ప్రతిష్టాత్మక 150 చిత్రంగా తెలుగులో ఖైదీ నెం.150 గా తెరకెక్కటం తెలుగులో కూడా అఖండ విజయాన్ని నమోదు చేసుకోవటం జరిగిపోయాయి.

తమిళ, తెలుగు ప్రేక్షకులను ఇంతలా ఆకట్టుకున్న ఈ చిత్ర కథపై గత కొంత కాలంగా బాలీవుడ్ వర్గాలు కూడా కన్నేశాయి. ఇప్పటికి ఈ చిత్రం బాలీవుడ్ లో రీమేక్ కావటానికి రంగం సిద్ధం అవుతోంది. హ్రితిక్ రోషన్ కథానాయకుడిగా ఒరిజినల్ వెర్షన్ ని తెరకెక్కించిన మురగదాస్ దర్శకత్వంలోనే కత్తి హిందీలోకి రీమేక్ కానుందని సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు చిత్ర షూటింగుతో బిజీగా వున్నా మురగదాస్ ఇది పూర్తి కాగానే బొంబాయి లో తన తదుపరి చిత్రంగా కత్తి రీమేక్ ని చేయనున్నాడట. ఇప్పటికే మురగదాస్ తమిళంలో చేసిన గజిని, తుపాకీ చిత్రాలను హిందీలోకి తానే రీమేక్ చేయగా, మురగదాస్ తమిళంలో ఇచ్చిన మరో సూపర్ హిట్ రమణ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ హిందీలో గబ్బర్ ఈజ్ బ్యాక్ గా రూపొందించగా ఈ చిత్రం కూడా బాలీవుడ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోగలిగింది.

Similar News