కొడుకు సినిమాల కోసమే తమ్ముడిని వెనక్కి నెట్టారా?

Update: 2017-01-26 21:30 GMT

తెలుగు చలన చిత్ర పరిశ్రమ మద్రాస్ లో వున్న నాటి నుంచి ప్రముఖ నిర్మాణ సంస్థ గా ఖ్యాతి గడించిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రస్తుతం చాలా అరుదుగా సినిమా నిర్మాణాలు చేపడుతుంది. ఏడాదికి ఒక చిత్రం కూడా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో విడుదల కానీ పరిస్థితిని చూస్తున్నాం. అయితే బాలీవుడ్ లో విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందిన సాల ఖడూస్ చిత్ర రీమేక్ రైట్స్ దక్కించుకుని విక్టరీ వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణం లో గురు సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ముందుగా ప్రకటించిన ప్రణాళిక ప్రకారం నేడు(26 జనవరి) విడుదల చేయాల్సి ఉండగా కొన్ని రోజుల కిందట ఎటువంటి కారణాలు తెలుపకుండానే నిర్మాత సురేష్ బాబు గురు చిత్రాన్ని ఏకంగా మూడు నెలల పాటు వెనక్కి నెడుతూ తన నిర్ణయాన్ని ప్రకటించారు.

రానున్న ఫిబ్రవరి నెలలో దగ్గుబాటి రానా నటించిన ఘాజీ చిత్రం విడుదల కానుండటంతో ఫెబ్రవరి నెల లో కూడా గురు విడుదల ప్లాన్ చేయకుండా ఏకంగా రానా దగ్గుబాటి విలన్ గా నటిస్తున్న బాహుబలి 2 విడుదలైన అనంతరం మే నెలలో గురు చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట సురేష్ బాబు. తన కొడుకు రానా దగ్గుబాటి నటించిన ఈ రెండు సినిమాలను కొన్ని ప్రాంతాలలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ విడుదల చేయనుండటం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సురేష్ బాబు చేతులలో ఒక పెద్ద కథానాయకుడి చిత్రాన్ని గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించే విధంగా రిలీజ్ చేయటానికి కావలసినన్ని థియేటర్లు ఉన్నప్పటికీ వెంకటేష్ సినిమాని ఇలా వాయిదా వేయటం వెంకీ అభిమానులకు మింగుడు పడటం లేదు. బాహుబలి అనంతరం గురు ని విడుదల చేయాలనుకుంటున్న సురేష్ బాబు కి బాహుబలి టీం నుంచే ముప్పు కూడా ఎదురవ్వొచ్చు. బాహుబలి ది బిగినింగ్ కూడా అనుకున్న సమయానికి నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తవ్వక సినిమా విడుదల వాయిదా వేసుకున్న ఆర్కా మీడియా వారు ఈ సారి ఏప్రిల్ కి కచ్చితంగా బాహుబలి 2 విడుదల చేయగలరా అనేదాని పై సురేష్ బాబు కే కాదు ఎవరికీ స్పష్టత లేదు. కాబట్టి గురు చిత్రం మే నెలలో విడుదలవటం కూడా కష్టంగానే కనపడుతుంది.

Similar News