కెరీర్ బెస్ట్ రికార్డును అందించనున్న చిత్రం

Update: 2016-12-12 15:04 GMT

పెరిగిపోయిన బడ్జెట్లు, అంతర్జాలానికి అలవాటు పడిన ప్రేక్షకుల సంఖ్య రీత్యా పాత రోజులలోలా ప్రేక్షకాదరణ పొందిన చిత్రం 100 రోజులు, 125 రోజులు దిశగా ప్రయాణం చేయటం నేటి తరంలో అగ్ర కథానాయకుల చిత్రాలకు కూడా సాధ్యపడటంలేదు. రానున్న మెగా స్టార్ చిరంజీవి 150 వ చిత్రం అమితంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాకూడా అధిక కేంద్రాలలో 50 రోజుల పాటు ఏకధాటిగా ప్రదర్శించబడటం సాధ్యపడక పోవచ్చు అని సినీ పండితుల అభిప్రాయం. అటువంటిది చిన్న చిత్రాల మనుగడ ఇంకా ఏ మాత్రం ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ యువ నటుడు నిఖిల్ నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రానికి ఈ అఆంక్షలు ఏమి వర్తిస్తున్నట్టు కనపడుట లేదు.

గత నెల 18 న విడుదలైన ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం తొలి ఆట నుంచి ప్రతి కేంద్రంలోనూ సంచలన వసూళ్లు రాబట్టుకుంది. దాదాపు మూడు వారాల పాటు పోటీ లేకుండా ఎక్కడికి పోతావు చిన్నవాడా ప్రయాణం సాగింది. మధ్యలో మన్యం పులి వంటి అనువాద చిత్రం ప్రేక్షకాదరణ పొందినా ఈ చిత్ర వ్యాపారం ఆశించిన స్థాయికి మించి జరిగింది. ఇక శుక్రవారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ధ్రువ చిత్రం విడుదలై భారీ విజయం దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ నిన్నటి వారాంతంలో మల్టీప్లెక్స్ లలో ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫుల్ ఆక్యుపెన్సీ తో ప్రదర్శితమవటం గమనార్హం. ధ్రువ చిత్రం విడుదల అనంతరం కూడా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100 కేంద్రాలలో 25 రోజులు పూర్తి చేసుకుంటున్నది ఎక్కడికి పోతావు చిన్నవాడా.

ఈ చిత్రం నిఖిల్ కెరీర్లో ఇప్పటికే ట్రాక్ రికార్డు కాగా, ఫుల్ రన్ లో 20 కోట్ల వసూళ్లు దాటి సాయి ధరమ్ తేజ్, నాగ చైతన్య, రామ్ వంటి కథానాయకుల సరసన నిఖిల్ కి 20 క్రోర్స్ క్లబ్లో స్థానం ఏర్పరిచే అవకాశం కూడా వుంది.

Similar News