కుర్ర దర్శకుడితో పని చేయనున్న చైతూ

Update: 2017-02-17 17:03 GMT

గత ఏడాది ఆఖరిలో డిసెంబర్ 29 న విడుదలైన తమిళ చిత్రం దుఱువంగల్ పతినారు చిత్రం సంక్రాంతి పండుగకి విడుదలైన విజయ్, విశాల్ వంటి హీరోలు నటించిన సినిమాలకు సైతం గట్టి పోటీని ఇచ్చి సూపర్ హిట్ టాక్ తో లాంగ్ రన్ ను దక్కించుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో అనేక చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన రెహ్మాన్ లీడ్ రోల్ పోషించారు. ఢిల్లీ గణేష్ ఒక అతిధి పాత్రలో కనిపించారు. అతి చిన్న చిత్రంగా విడుదలై వసూళ్ల సంచలనం సృష్టించిన ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు 22 సంవత్సరాల కుర్రాడు. ఇప్పుడు కార్తీక్ నరేన్ అంటే తమిళనాడు సినిమా ప్రేక్షకులలో గుర్తుపట్టని వారుండరేమో. దుఱువంగల్ పతినారు తో తొలి సారి దర్శకత్వం వహించిన కార్తీక్ నరేన్ పరిచయ చిత్రంతోనే అంత పాపులర్ అయిపోయాడు.

కార్తీక్ నరేన్ ఈ చిత్రాన్ని మల్టీ లాంగ్వేజ్ లలో తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అరవింద్ స్వామి కీలక పాత్ర పోషించబోయే ఈ చిత్రం తెలుగు వెర్షన్ కి అక్కినేని నాగ చైతన్య ని కథానాయకుడిగా ఎంచుకున్నాడట కార్తీక్ నరేన్. ఇప్పటికే స్టోరీ నేరేషన్ కూడా ఐపోగా చైతూ కార్తీక్ నరేన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని సమాచారం. తెలుగు, తమిళ, మళయాళ భాషలలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మలయాళం లో నటించబోయే హీరో ఎంపిక పనిలో నిమగ్నమై వున్నాడట ఈ కుర్ర దర్శకుడు.

తమిళంలో సూపర్ హిట్ ఐన దుఱువంగల్ పతినారు చిత్రం తెలుగు లో '16 ఎవ్రి డీటెయిల్ కౌంట్స్' గా మార్చ్ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. బిచ్చగాడు, పిల్ల రాక్షసి వంటి వినూత్న చిత్రాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ వారు ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు.

Similar News