కాపీ రైట్స్ సంగీత దర్శకుడికి దక్కటం చాలా బాధాకరం

Update: 2017-03-22 11:37 GMT

సంగీత ప్రపంచంలో మునిగి తేలుతూ ఆహ్లాదకరమైన పాటలని ఆస్వాదించే సంగీత అభిమానులకు పరిచయం అవసరం లేని సంగీత దర్శకులు మేస్ట్రో ఇళయరాజా. అలానే దక్షిణాదిన ప్లే బ్యాక్ సింగర్స్ లో జె.ఏసుదాస్ తరువాతి స్థానంలో దశాబ్దాలుగా తన గాత్రంతో పాటకి ప్రాణం పోస్తున్న గాయకుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్ని వందల పాటలు వచ్చాయో లెక్కే లేదు. వీరిద్దరూ వృత్తి పరంగా ఎంత డెడికేషన్ తో వుంటారో, వారి మధ్య వ్యక్తిగత జీవితంలో వెలకట్టలేని స్నేహ బంధం ఉందనేది అందరికి తెలిసిన విషయమే. అయితే వీరి మధ్య వచ్చిన కాపీ రైట్స్ ఇష్యూ లీగల్ నోటీసులు పంపుకునే వరకు వెళ్ళటం అందరిని విస్మయానికి గురి చేసింది.

ఇళయరాజా తనకి పంపిన లీగల్ నోటీసులకు సమాధానం తాను కూడా చట్ట పరంగానే ఇవ్వదలుచుకున్నానని వెల్లడించిన ఎస్.పి.బాలు, ఈ విషయమై అసలు ఇళయరాజా తన వద్ద ప్రస్తావించ లేదంటూ వాపోయిన తరువాత సినిమా ప్రముఖులు ఎవ్వరూ ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తన వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తపరుస్తూ, "ఒక నిర్మాత తన ఖర్చుతో తెరకెక్కే సినిమాలో పాట కోసం సంగీత దర్శకుడి దగ్గర స్వరాన్ని, లిరిక్ రైటర్ దగ్గర సాహిత్యాన్ని, ప్లే బ్యాక్ సింగర్స్ దగ్గర గాత్రాన్ని వాడుకుంటూ వారికి పారితోషికం చెల్లిస్తాడు. అలాంటప్పుడు సదరు సినిమాలలోని పాటలపై కాపీ రైట్స్ అన్నీ నిర్మాతలకి చెందాలి కానీ, ఇలా సంగీత దర్శకుడు ఒక ప్లే బ్యాక్ సింగర్ కి లీగల్ నోటీసులు పంపటం ఎంత వరకు సమంజసం? ఇప్పటి నుంచైనా పరిశ్రమలో నిర్మాతకి దక్కవలసిన హక్కులు నిర్మాతకి దక్కేలా ఒప్పందాలలో మార్పులు చేయవలసిన ఆవశ్యకత వుంది." అంటూ పూర్తి పరిణామం లో తప్పెవరిది అనేది ప్రస్తావించ కుండా అసలు నిర్మాతకి లేని పేటెంట్ హక్కులు ఇళయరాజా కి ఎలా దక్కుతాయి అనే కోణంలో ఎస్.పి.బాలు కి మద్దతు పలికారు తమ్మారెడ్డి భరద్వాజ్.

Similar News