కథ కన్నా టైటిల్ ముఖ్యం

Update: 2017-10-10 03:50 GMT

టాలీవుడ్ లో ఇప్పుడు సినిమా కథలకన్నా సినిమా టైటిల్ కే ఎక్కువ ప్రత్యేకతను ఇస్తున్నట్టుగా అర్ధమవుతుంది. సినిమా కొత్తగా ఉండకపోయినా పర్వాలేదు టైటిల్ మాత్రం కచ్చితంగా కొత్తగా.... క్యాచీగా ఉంటె నేరుగా ప్రేక్షకులకు చేరుతుంది..... అప్పుడు మాత్రమే ప్రేక్షకులు సినిమాకి ఎట్రాక్ట్ అవుతారు. అందుకే ఇప్పుడు రాబోయే సినిమాలకు కొత్తగా ఉండే టైటిల్స్ ని ప్రేక్షకుల కోసం రెడీ చెయ్యడమే కాదు.... పనిలోపనిగా ఇప్పటివరకు ఉన్న పుకార్లకు ఓ క్లారిటీ కూడా ఇచ్చేస్తున్నారు.

ఇప్పటివరకు పవన్ - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న సినిమాకు చాలా టైటిల్స్ తెరపైకి వచ్చాయి. కానీ చిత్ర బృందం PSPK 25 సినిమాకి అజ్ఞాతవాసి అనే టైటిల్ ని దాదాపు ఫిక్స్ చేశారు. ఈ అజ్ఞాతవాసి టైటిల్ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రిజిస్టర్ అయింది. మరోవైపు పవన్ కళ్యాణ్ అన్న కొడుకు వరుణ్ తేజ్ కొత్త సినిమాకు పవన్ గతంలో నటించిన తొలిప్రేమ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ తొలిప్రేమ టైటిల్ రిజిస్టర్ చేయించాడు.

మరోపక్క దిల్ రాజు కూడా హరీష్ శంకర్ డైరెక్షన్ లో దాగుడు మూతలు అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడు. హరీష్ శంకర్ రాసుకున్న ఒక మల్టీస్టారర్ కథ కోసం ఈ టైటిల్ ని దిల్ రాజు రిజిస్టర్ చేయించాడు. గౌతమ్ నందా సినిమాతో మిశ్రమ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు సంపత్ నంది కూడా తన సొంత బ్యానర్ పై 'సీటీమార్' అనే క్యాచీ టైటిల్ రిజిస్టర్ చేయించాడు. ఇక అభిషేక్ పిక్చర్స్ వాళ్లు విటమిన్ - ఎమ్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ నిర్మాతలు నేను నా దిల్ వంటి టైటిల్స్ ని ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు.

Similar News