ఈ దర్శకుడి చేతిలో చాలా థియేటర్లు వున్నాయ్

Update: 2017-01-09 06:16 GMT

తెలుగు రాష్ట్రాల్లో ఏ పెద్ద సినిమా వల్లనైనా ప్రేక్షకాదరణ పొందుతున్నప్పటికీ ప్రదర్శించటానికి థియేటర్లు దొరకక చిన్న సినిమా నలిగిపోతే మూకుమ్మడిగా కొన్ని గళాలు ఈ దుస్థితికి కారణం ఆ నలుగురు బడా నిర్మాతలే అని విరుచుకు పడుతుంటాయి. కానీ ఆ నలుగురు ఎవరు అనేది మాత్రం ఎప్పుడు బహిర్గతం చేయకుండా వినేవారి ఊహకే వదిలేస్తారు. ఆలా ఇప్పటికే ప్రముఖ నిర్మాణ సంస్థలలో నాలుగిటిని సామాన్య ప్రేక్షకులు అలా ఫిక్స్ అయిపోయారు. అయితే వారి చేతుల్లో ఎన్ని థియేటర్లు వున్నాయనే దానిపై రుజువుతో సంఖ్యను ఆరోపణలు చేసే వారెవరు వెల్లడించరు. ఈ పోకడ ప్రతి రెండు నెలలకి ఓ మూడు రోజుల ముచ్చటగా నడిచేదే కదా అని ఆ నలుగురు కూడా తమ థియేటర్ల లిస్ట్ బైటకి చెప్పరు. ఇటువంటి పరిస్థితుల్లో మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఒక ఇంటర్వ్యూ లో తన పెట్టుబడి అంతా థియేటర్లపైనే అని, సినిమాల ద్వారా సంపాదించే ఆదాయం మొత్తం థియేటర్లపైనే పెడతానని తన థియేటర్ల లిస్ట్ ను బహిర్గతం చేసేశాడు.

"నా చిన్న తనం నుంచే మాకు మా ఊర్లో ఒక థియేటర్ ఉండేది. మా థియేటర్లో నేను ఎడబాటు లేకుండా చుసిన సినిమాలే నాకు సినిమా పరిశ్రమ పై మక్కువ పెంచాయి. సినిమా పరిశ్రమకి వచ్చి సక్సెస్ ఐన తరువాత నేను దర్శకుడిగా పని చేసి సంపాదించిన సొమ్మంతా నేను థియేటర్లపైనే పెట్టుబడిగా పెడుతుంటాను. విశాఖపట్నం లో మూడు థియేటర్లను కలిపి v -మాక్స్ కాంప్లెక్స్ గా మలిచాం. ఈస్ట్ గోదావరి జిల్లా సామర్లకోట లోని సత్య కృష్ణ థియేటర్, చాగల్లు లోని వెంకట కృష్ణ థియేటర్లు నావే. రాజముండ్రి లో ఒక మల్టీప్లెక్స్ నిర్మాణం కోసం స్థలం కొని వుంచాను. త్వరలోనే అక్కడ మల్టీప్లెక్స్ నిర్మాణంతో పాటు వివిధ ప్రాంతాలలో ఇంకా కొన్ని థియేటర్లు కొనాలనుకుంటున్నాను." అని తన థియేటర్స్ లిస్ట్ ప్రకటించారు వినాయక్.

Similar News