ఇది నా ఆఖరి చిత్రం కాకపోవచ్చు

Update: 2017-02-08 15:06 GMT

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు గతంలో రామారావు నుంచి కృష్ణ వరకు, చిరంజీవి నుంచి అల్లు అర్జున్ వరకు దాదాపు మూడు తరాల కథానాయకులను డైరెక్ట్ చేసిన ఘనత సాధించారు. తెలుగు లో స్టార్ కిడ్స్ ఎంట్రీలకి రాఘవేంద్ర రావు లాంచింగ్ పాడ్ లా కూడా పని చేశారు. కృష్ణ గారి నట వారసుడు మహేష్ బాబు ని, అల్లు అరవింద్ తనయుడిగా అల్లు అర్జున్ వెండితెర పరిచయానికి, ఇటీవల ఇంటింటా అన్నమయ్య చిత్రంతో నిర్మాత యలమంచిలి సాయి బాబు తనయుడు యలమంచిలి రేవంత్ తో పాటు పలువురు స్టార్ కిడ్స్ ని లాంచ్ చేసి వారికి సక్సెస్ ఫుల్ కెరీర్ కి నాంది పలికారు. అటువంటి దర్శకేంద్రుడు గత కొంత కాలంగా సినిమాల నుంచి విరామం తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 10 న విడుదల కాబోతున్న ఓం నమో వెంకటేశాయ దర్శకేంద్రుడి ఆఖరి చిత్రం కాబోతుందని ప్రచారం సాగుతుంది.

తన రిటైర్మెంట్ పై దర్శకేంద్రుడు పెదవి విప్పారు. "నా కెరీర్ లో నేను సాధించిన ఘనతలన్నీ నేను ప్లాన్ చేసి చేసినవి కావు. ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ చిత్రం కూడా స్వామి వారు నాతో చూపించారని బలంగా నమ్ముతాను. నగరం మొత్తం వర్షం పడుతున్నా ఫిలిం సిటీలో వర్షం పడకపోవటం, మా చిత్రీకరణ సజావుగా సాగటం, సెట్స్లో బ్రహ్మోత్సవం పాట చేస్తున్న సమయానికి తిరుమలలో బ్రహ్మోత్సవం జరగటం, అనుష్క పై దుర్గా దేవి పాట చేస్తున్నప్పుడు సరిగ్గా నవ రాత్రులు ప్రారంభం కావటం ఇవ్వన్నీ యాదృచ్చికం అని నేను అనుకోవటం లేదు. ప్రకృతి ఓం నమో వెంకటేశాయ కి అండగా నిలుస్తూ మమ్మల్ని ముందుకి నడిపించినట్టే మా వెంట దైవ బలం కూడా తోడుగా ఉందనుకుంటాను. అలానే నా ఆఖరి చిత్రం ఏది అనే నిర్ణయం నా చేతుల్లో లేదు. స్వామి వారే నిర్ణయించాలి. నేనైతే సినిమా చేయగల ఓపిక ఉన్నంత కాలం చేస్తూనే ఉంటానేమో. ఎప్పటి నుంచో అనుకుంటున్నా రావణ్ చిత్రం మంచు మోహన్ బాబు వల్లే ఆలస్యం అవుతోంది. ఆయన ఒక్కరు ఇప్పుడు సరే అంటే వెంటనే చేసేయటమే. ఆ పాత్ర మోహన్ బాబు తప్ప మరో నటుడు చేయలేనిది. ఇక ఇప్పుడు నేను యాదగిరి గుట్ట ని సందర్శించిన నాటి నుంచి నా తదుపరి చిత్రం లక్ష్మి నరసింహ స్వామి పై చేయాలని అనుకుంటున్నాను. మరి దైవ నిర్ణయం ఎలా వుండబోతుందో చూడాలి." అని 74 సంవత్సరాల వయసులో తన కెరీర్ మొత్తాన్ని దైవం చేతిలో ఉందని చెప్తున్నారు కే.రాఘవేంద్ర రావు.

Similar News