ఇది కేవలం ఒక ఊరు వాళ్లనే ఆకర్షిస్తుందా?

Update: 2016-12-18 06:57 GMT

వాస్తవ సంఘటనలు తెరపై ఆవిష్కరించే ప్రయత్నాలు సినిమా పుట్టిన నాటినుంచి నేటి వరకు అనేక సార్లు జరిగాయి. వాటిల్లో ఎన్నో ప్రయత్నాలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి కూడా. ఇటువంటి వాస్తవ ఘటనలు లోతుగా పరిశీలించి చూస్తే ఎన్నో వివాదాస్పద కథనాలు, ఎందరో మనోభావాలకు సంబంధించిన వాస్తవాలు, ప్రపంచానికి పరిచయం కాకుండా నాలుగు గోడల మధ్య నలిగిపోయిన ఎన్నో నిజాలు ఇవన్నీ దాటుకుని సినిమా తీయటానికి సిద్దపడప్పుడు పలు బెదిరింపులు, హెచ్చరికలు సహజంగానే వస్తుంటాయి. ఇటువంటి వాటికి అసలు దడవని ఫిలిం మేకర్ రామ్ గోపాల్ వర్మ. గతంలో ఆయన తెరకెక్కించిన అనంతపురం జిల్లా ఫ్యాక్షన్ కక్షల నేపథ్యంలో రక్త చరిత్ర సమయంలో, కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను గజ గజ వణికించిన స్మగ్లర్ వీరప్పన్ కథ చెప్పినప్పుడు ఇటువంటి బెదిరింపులు వర్మను వెంటాడాయి. కానీ వర్మ వాటికి లొంగకుండా సినిమాలు తీసి విడుదల చేయగా అవి ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యాయి.

ఈ నెల 23 న విడుదల కానున్న వంగవీటి చిత్రం విజయవాడ నగరంలో దశాబ్ద కాలాల పాటు సాగిన ఆధిపత్య పోరు, కుల కక్షల నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కేవలం వంగవీటి వర్గీయులకు, వారి ప్రత్యర్ధ వర్గీయులకు మాత్రమే ఆసక్తి కలిగిస్తుంది అని మిగిలిన ప్రాంతాల్లోని ప్రజలు, సగటు ప్రేక్షకులు ఈ చిత్రం గురించిన ఊసు అయినా పట్టించుకోవటం లేదు అని పలు కథనాలు వినపడుతున్నాయి. కానీ వర్మ మాత్రం తన సొంత పబ్లిసిటి పద్దతులపై ప్రగాఢ నమ్మకంతో వున్నాడు. అయితే రక్త చరిత్ర ను కేవలం అనంతపురం ప్రజలు, కిల్లింగ్ వీరప్పన్ ను కేవలం కర్ణాటక ప్రజలు మాత్రమే ఆదరించి ఉంటే అంత గుర్తింపు వచ్చేది కాదు అనేది కూడా గ్రహించాలి.

Similar News