ఇంతగా మారాడా..!!

Update: 2017-06-30 10:30 GMT

టాలీవుడ్ లో బోయపాటికి మాస్ చిత్రాల దర్శకుడిగా పేరుంది. ఆయన తీసిన మొదటి సినిమా 'భద్ర' దగ్గరనుండి నిన్నమొన్నటి 'సరైనోడు' వరకు బోయపాటి తన మార్క్ మాస్ ని వదలలేదు. అయితే ఎంతపెద్ద హిట్ సినిమాలు తీసిన దర్శకుడికి అయినా మధ్యలో గ్యాప్ రావడమనేది సర్వసాధారణంగా అయ్యింది ఇప్పుడు. అలాగే బోయపాటి కూడా 'సరైనోడు' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చాలా కాలం ఖాళీగానే వున్నాడు. అయితే ఈలోపు బోయపాటికి బెల్లంకొండ వల విసిరాడు. తనకొడుకు సాయి శ్రీనివాస్ ని ఎలాగైనా టాలీవుడ్ లో హీరోగా నిలబెట్టాలని కంకణం కట్టుకున్న బెల్లంకొండ సురేష్ ,బోయపాటిని తన కొడుకు మూడో సినిమా కోసం తీసుకొచ్చాడు. అంటే భారీగా రెమ్యునరేషన్ ఇచ్చే ఉంటాడు లేకుంటే బోయపాటి ఇంత చిన్న హీరోతో సినిమా ఎందుకు ఒప్పుకుంటాడులే గాని.. అనె అనుమానం అందరికి బాగా బలపడింది.

ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని ఎంత మాస్ గా చూపిస్తాడో బోయపాటి అని అనుకుంటున్న సమయంలో ఈ చిత్రానికి ‘జయ జానకి నాయక’ అంటూ క్లాస్ టైటిల్ బయటికి వచ్చింది. మరి ‘జయ జానకి నాయక’ అంటూ క్లాస్ టైటిల్ తో షాక్ ఇచ్చిన బోయపాటి ఫస్ట్ లుక్ ని కూడా రొమాంటిక్ యాంగిల్ లో వదిలి మళ్ళీ షాక్ ఇచ్చాడు. ఈ ‘జయ జానకి నాయక’ ఫస్ట్ లుక్ లో శ్రీనివాస్ ని రోడ్డు మీద కూర్చోబెట్టి బైక్ కి అనుకున్న రకుల్ ప్రీత్ సింగ్ కి ఎదో చూపిస్తూ చాలా రొమాంటిక్ గా కనబడుతున్నారు ఇద్దరు. మరి ఈ పోస్టర్ చూస్తుంటే మాత్రం బోయపాటి తన మాస్ ని పక్కన పెట్టి ఈసారి లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని అర్ధమవుతుంది.

ఈ ‘జయ జానకి నాయక’ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన ఎవ్వరైనా ఇదసలు బోయపాటి సినిమానేనా అనిపించేలా వుంది. మరి రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ చిత్రంలో చాలా హోమ్లీ గా కనబడుతుంది. అసలు ఈ లుక్ ని చూస్తుంటే టోటల్ గా ఒక ప్యూర్ లవ్ స్టోరీని మనం చూడబోతున్నామని అర్ధమవుతుంది. షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్న ఈ చిత్రంలో భారీ తారాగణమే నటిస్తున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ ‘జయ జానకి నాయక’కి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రం ఆగష్టు 11 న విడుదలకు సిద్దమవుతుంది.

Similar News