అస్సలు తగ్గరు

Update: 2017-09-06 04:01 GMT

సినిమా పరిశ్రమలోని హీరోలంతా ఐకమత్యంగానే ఉంటారు. కానీ అభిమానులు మాత్రం బయట కొట్టుకు చస్తారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్పంటూ బయలుదేరుతారు. ఈ అభిమానుల మధ్య మనస్పర్ధలనేవి అనాది కాలం నుండి వస్తున్నవే. ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు. అయినా ఈ అభిమానుల గోల ఎప్పటికప్పుడు హైలెట్ అవుతూనే వుంది. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ ఫాన్స్, అల్లు అర్జున్ ఫాన్స్ సోషల్ మీడియాలో తన్నుకోవడమే కాదు రోడ్డెక్కి మరి బలాబలాలు చూపించుకునే స్థాయికి దిగజారిపోయారు.

ఇప్పుడు ఇద్దరు హీరోల అభిమానుల మధ్యన ఈ కుల పిచ్చితో గొడవలు ముదిరి పాకాన పడ్డాయి. తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోనలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానుల మధ్య ఫ్లెక్సీల ఏర్పాటు విషయమై గొడవలు చెలరేగాయి. కాట్రేనికోనలోని సుబ్రహ్మణ్యస్వామి గుడి దగ్గర ఏర్పాటుచేసిన వినాయక చవితి మండపం ఎదుట మహేష్ బాబు అభిమానులు.. తమ హీరోతో పాటు కొందరు రాజకీయ నాయకులకు చెందిన రెండు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనిపై మరో హీరోకి చెందిన అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాటిని అక్కడినుండి తీసివేశారు. అసలు అక్కడ ఫ్లెక్సీల ఏర్పాటుపై ముందు నుంచే రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య గొడవ మొదలయ్యింది.

ఇంతకుముందే మహేష్ ప్లెక్సీలను వారు తొలగించగా మహేష్ అభిమానులు మళ్ళీ మహేష్ ఫ్లేక్సీలను ఏర్పాటు చెయ్యడంతో అక్కడ ఆ గొడవ తారా స్థాయిని చేరుకుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్లేక్సీలను తొలగించాలంటూ మరో సామాజిక వర్గం నుంచి కూడా డిమాండ్లు మిన్నంటాయి. ఇక ఆ గొడవ సర్దుమణగడానికి అక్కడ అధికారుల జోక్యం కూడా చేసుకోవాల్సి వచ్చింది. మరి సినిమా పరిశ్రమలో హీరోల మధ్య ఎటువంటి ఈగోలు ఉండవు కానీ.... బయటకొచ్చి చూస్తే అభిమానం హద్దులు దాటి అభిమానులు కత్తులు దూసుకుంటూ కనబడుతున్నారు.

Similar News