అస్సలు తగ్గట్లేదుగా...!

Update: 2017-01-21 02:30 GMT

'ధ్రువ' విజయంతో రామ్ చరణ్ ఫుల్ జోష్ మీదున్నాడు. 'ధ్రువ' లో రామ్ చరణ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ విజయాన్ని ఆస్వాదిస్తూ ఉండగానే నిర్మాతగా తన తండ్రి నటించిన 150 వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150 ' తో తోలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. తన తల్లి సురేఖ 'ఖైదీ...' చిత్ర నిర్మాత అయినప్పటికీ రామ్ చరణ్ అన్నీ తానై 'ఖైదీ నెంబర్ 150 ' నిర్మాణ బాధ్యతలను నెత్తిన వేసుకున్నాడు. ఇక ఆ చిత్రం ఇటీవలే విడుదలై కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ చరణ్ కు లాభాల పంటను తెచ్చిపెట్టింది. ఇక ఈ విజయాలతో మంచి జోష్ మీదున్న రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో పడ్డాడు.

రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్న విషయం తెలిసిందే. చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కబోయే ప్రేమ కథా చిత్రం ఈ నెల 30 న మొదలవబోతున్నట్లు సమాచారం. పూజ కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది సమాచారం. గ్రామీణ వాతావరణంలో తెరకెక్కబోతే ఈ చిత్రంలో చరణ్ లవర్ బాయ్ గా కనిపించనున్నాడని అందుకే చరణ్ తన లుక్ ని టోటల్ గా మార్చుకున్నాడనే ప్రచారం జరుగుతుంది. మరి ఈ చిత్రంలో 'అ... ఆ, ప్రేమమ్, శతమానంభవతి' ఫేమ్ అనుపమ పరమేశ్వరన్, రాశి ఖన్నాలు రామ్ చరణ్ కి జోడిగా సెలెక్ట్ అయినట్లు వార్తలొస్తున్నాయి.

మొదటి షెడ్యూల్‌ గోదావరి జిల్లాలో చిత్రీకరించేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుకుమార్ క్లోజ్ ఫ్రెండ్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఇక దాదాపు ఒక సంవత్సరంపాటు బిగ్ గ్యాప్ తీసుకున్న సుకుమార్ 'నాన్నకి ప్రేమతో' తర్వాత చేస్తున్న ప్రాజెక్టు కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Similar News