అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోన్న నాగ్‌...!

Update: 2016-03-30 15:30 GMT

రెండేళ్ల కిందట నాగ్‌ పరిస్దితి వేరు. ఇక సోలో హీరోగా ఆయన రిటైర్‌ కావడమే మంచిదనే విమర్శలు వచ్చాయి. 'సింహా, లెజెండ్‌' చిత్రాల తర్వాత ఇప్పుడున్న సీనియర్‌స్టార్స్‌లో 50కోట్ల మార్క్‌ను అందుకోగలిగిన సత్తా కేవలం బాలయ్యకు మాత్రమే ఉందని విమర్శకులు విశ్లేషించారు. 'మనం' చిత్రం వచ్చి హిట్టయితే అది మల్టీస్టారర్‌ కదా! అని కొట్టేశారు. 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రం 50కోట్ల మార్క్‌ను దాటితే అది అదృష్టం అన్నారు. తాజాగా వచ్చిన 'ఊపిరి' విజయం చూసిన తర్వాత ఇక ట్రేడ్‌ వర్గాలు, విమర్శకుల నోళ్లకు మూతలు పడ్డాయి. కానీ నాగార్జున మాత్రం తనకే సొంతమైన దారిలో వెళ్లి హ్యాట్రిక్‌ నమోదు చేసుకున్నాడు. కాగా 'ఊపిరి'కి ముందు కూడా పలువురు విశ్లేషకులు ఈ చిత్రం తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ వసూలు చేస్తుందని, కార్తీ ఉన్నందున తమిళంలోనే ఈచిత్రం వర్కౌట్‌ అవుతుందని, తెలుగులో మాత్రం నాగ్‌కు అంత క్రేజ్‌ లేదు కాబట్టి ఇక్కడ పెద్దగా ఈ చిత్రం విజయం సాధించే అవకాశాలు లేవని తేల్చేశారు. కానీ ఈ చిత్రం విడుదలైన తర్వాత మాత్రం తమిళంలో కంటే తెలుగులోనే ఈచిత్రం మంచి పేరును తెచ్చుకొంది. మొత్తానికి నాగ్‌ 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో తర్వాత మరింతగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడనేది వాస్తవం. గతంలో హిందీలో కూడా అమితాబ్‌ పని అయిపోయింది అనుకున్న సమయంలో ఆయన చేసిన 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' షో తర్వాత మరలా ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఏదేమైనా నాగ్‌ ప్రస్తుతం సీనియర్‌ స్టార్స్‌ అందరిలో ముందంజలో ఉన్నాడనేది మాత్రం వాస్తవం.

Similar News