అసలైన వంగవీటి మరో ఏడాదికి

Update: 2016-12-28 21:30 GMT

తాజాగా విడుదలైన వంగవీటి చిత్రం విజయవాడ నగరంలో సమసిపోయిన ఆధిపత్య పోరు రెండు కీలక వర్గాల మధ్య తిరిగి రాచుకుంటుందేమో అని పోలీస్ శాఖ వారు భయ పడ్డారు. అటువంటి వర్గ పోరు భగ్గుమంటే అదుపు చేయటానికి తగినంత బలాన్ని ముందుగానే విజయవాడ నగరంలో సిద్ధం చేసుకున్నారు. అయితే అదృష్టవ శాత్తు వంగవీటి చిత్రంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏ ఒక్క వర్గం పైనా నింద మోపకుండా నాటి పరిస్థితులకు అప్పటి విజయవాడ నగర నాయకుల చుట్టూ అల్లుకున్న భావోద్వేగాలను మాత్రమే తెరకెక్కించారు. దీనితో ముందుగా భయపడ్డట్టు లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తలేదు కానీ వంగవీటి మోహన రంగ తనయుడు వంగవీటి రాధ కృష్ణ తో పాటు రాధా రంగ మిత్ర మండలి సభ్యులు అందరూ రంగా జీవితంలోని అనేక వాస్తవాలను వక్రీకరించి ఈ సినిమా చేశారని తీవ్ర ఆరోపణలు, నిరసనలు చేశారు. కాగా, ఈ ఆరోపణలకు తనదైన శైలిలో స్పందించిన వర్మ, రంగా మహానుభావుడు కాదని, వాస్తవాలే తెరకెక్కిస్తే ఆయన కుటుంబం, అభిమానులు తలెత్తుకోలేరని, ఒకవేళ వంగవీటి సినిమా లో చూపిన రంగా జీవితం నిజం కాకపోతే నిజమైన బయోపిక్ 'అసలు వంగవీటి' పేరుతో తెరకెక్కించుకోండి అంటూ సవాల్ విసిరారు.

రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ సవాల్ కు ఒక్క రోజు కూడా గడవక ముందే గంటల వ్యవధిలోనే స్టంట్ మాస్టర్ కం యాక్టర్ కం డైరెక్టర్ జీవీ సుధాకర్ నాయుడు(జీవీ). వచ్చే ఏడాది ఇదే సమయానికి 'అసలు వంగవీటి' పేరుతో వర్మ వెలుగులోకి తీసుకురాని రంగా జీవితాన్ని వెండితెర పై ఆవిష్కరిస్తానంటూ వర్మ కు ప్రతి సవాల్ విసిరారు. కాగా ఆయనకు ఫండింగ్ చేసే నిర్మాణ సంస్థ గురించి కానీ, నిర్మాతల గురించి కానీ ఆయన వెల్లడించలేదు. అయితే ఈ చిత్రానికి రంగా రాజకీయ అనుచరులైన మల్లాది విష్ణు లతో పాటు రాధా రంగా మిత్ర మండలి నుంచి ఈ చిత్ర నిర్మాణానికి నిధులు సమకూరనున్నాయని కథనాలు వినపడుతున్నాయి.

Similar News