అల్లుడి సినిమాకు క్లాప్ కొట్టిన మామ గారు

Update: 2016-12-16 06:27 GMT

వరుసగా విభిన్న కథలతో ద్దోసుకుపోతున్న ధనుష్ తాజాగా కోడి(తెలుగులో ధర్మ యోగి) ఇచ్చిన కిక్ తో ఒకేసారి పలు ప్రాజెక్ట్స్ పట్టాలెక్కించేసాడు. ఇప్పటికే ఆయన నిర్మాణంలో ఒక చిత్రం చిత్రీకరణ కు సిద్దమైపోగా, ఇప్పుడు ధనుష్ నటిస్తున్న వి.ఐ.పి 2 చిత్రం చిత్రీకరణ ప్రారంభం ఐయింది. వి.ఐ.పి చిత్రం తమిళంలో భారీ విజయం పొందటమే కాక తెలుగులోకి రఘువరన్ బి.టెక్ గా అనువాదమై ధనుష్ కి ఇతర తమిళ హీరోల స్థాయిలో తెలుగులోనూ సమాంతర మార్కెట్ ఏర్పరిచింది. ఇక ఇప్పుడు అంతటి భారీ విజయం పొందిన చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతుండటంతో ఇప్పటికే ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

మద్రాస్ నగరంలో చిత్రీకరణ ప్రారంభోత్సవం జరుపుకున్న వి.ఐ.పి 2 కి ధనుష్ పై తీసిన తొలి షాట్ కి ఆయన మామ గారు ఇండియన్ సూపర్ స్టార్ రజని కాంత్ క్లాప్ కొట్టి శ్రీకారం పలికారు. తొలి భాగంలో ధనుష్ సరసన కథానాయికగా నటించిన అమల పాల్ ఈ చిత్రంలో కూడా కథానాయికగా కనిపించనుంది. అల్లుడితో ఈ చిత్రం చేస్తూనే మరో వైపు రజని కాంత్ తో కబాలి ఫేమ్ పా.రంజిత్ తెరకెక్కించనున్న కబాలి సీక్వెల్ లోనూ అమల పాల్ చోటు సంపాదించుకుంది. విడాకులు పొందిన తరువాత అమల పాల్ చేస్తున్న పెద్ద చిత్రం వి.ఐ.పి 2 కావటం విశేషం.

Similar News