అర్జున్ రెడ్డి కోసం పోటీపడుతున్న భామలు

Update: 2017-10-10 10:00 GMT

తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగా దర్శకుడిగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ అయ్యి పెద్ద సంచలనం సాధించింది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమా హక్కులను ఇతర బాషల నిర్మాతలు చేజిక్కించేసుకున్న విషయం తెలిసిందే. అయితే అర్జున్ రెడ్డి సినిమా తమిళ రీమేక్ లో హీరోగా ఎవరు చేస్తారు అనే సస్పెన్స్ కి తెర దించుతూ తమిళ అర్జున్ రెడ్డి సినిమాలో విక్రం తన కొడుకు అయిన ధ్రువ్ ని హీరో గా పరిచయం చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించేసాడు. అలాగే అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ని తమిళంలో ప్రముఖ డైరెక్టర్ అయిన బాల డైరెక్ట్ చేయబోతున్నారు అనేది కూడా అనౌన్స్ చేసాడు విక్రమ్.

ఇక బాల దర్శకత్వంలో విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా పరిచయం కాబోతున్న ఈ చిత్రంపై మంచి క్రేజ్ ఏర్పడిపోయిది. అయితే అర్జున్ రెడ్డి చిత్రం కేవలం కుర్రకారుకి కనెక్ట్ అయ్యిందిగాని చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అంటే.. కుటుంబం మొత్తం కలిసి కూర్చుని చూసే సినిమాగా లేదనేది తెలిసిన విషయమే. మరి ఇలాంటి సినిమాలో విక్రమ్ తన కొడుకు ధృవ్ ని పరిచయం చెయ్యడం ఎంతవరకు కరెక్ట్ అని వాదించేవాళ్లు ఉన్నారు. ఏదిఏమైనా అన్ని కుదురుకుని ఇలా ఈ రీమేక్ సినిమా కి హీరో ఇంకా దర్శకుడు ఇద్దరూ సెట్టైపోవడంతో.... ఇప్పుడు హీరోయిన్ ఎవరనే ప్రశ్న కోలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంది.

అర్జున్ రెడ్డి తెలుగు వెర్షన్ లో విజయ్ దేవరకొండ సరసన షాలిని పాండే నటించింది. మరి తమిళంలో ధృవ్ పక్కన నటించబోయే ఆ భామ ఎవరు అంటే ఇద్దరి పేర్లు గట్టిగా విబడుతున్నాయి. ధ్రువ్ సరసన కమల్ హాసన్ రెండో కుమార్తె అయిన అక్షర హాసన్ నటించబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. కాని ఈ వార్తలపై చిత్ర బృందం నుంచి గాని విక్రం నుంచి గాని ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అక్షర హాసన్ బదులు నిర్మల కాన్వెంట్ ఫేమ్ శ్రియ శర్మ ని తీసుకుందాం అనే ఆలోచనల్లో ఉన్నారట చిత్ర బృందం. మరి అక్షర హాసన్, శ్రియ శర్మలలో ఎవరు అర్జున్ రెడ్డి రీమేక్ లో ధృవ్ పక్కన నటించే అవకాశం కొట్టేస్తారో చూద్దాం.

Similar News