అభిమానుల కోసమే కాక సామాన్య ప్రేక్షకుల కోసం చెర్రీ

Update: 2016-12-10 10:00 GMT

మెగా స్టార్ చిరంజీవి లెగసీ ని కొనసాగించటానికి ఎందరో మెగా ఫామిలీ కథానాయకులు ఉండటంతో ఏ ఒక్క యువ కథానాయకుడిపై పూర్తి బాధ్యత పడదు. దీనిని అడ్వాంటేజ్ గా తీసుకుని అల్లు అర్జున్, వరుణ్ తేజ్ మెగా అభిమానుల అభిరుచికి పరిమితం కాకుండా సగటు ప్రేక్షకుడి మెప్పు పొందటానికి కృషి చేస్తున్నారు. బన్నీ చేసిన ఆర్య, పరుగు, వేదం, రుద్రమదేవి, వరుణ్ తేజ్ చేసిన కంచె, ఇప్పుడు చేస్తున్న ఫిదా ఇందుకు నిదర్శనం. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తొలి నుంచి ఒకే తరహా కథలను ఎక్కువగా ఎంపిక చేసుకున్నాడు. ఆయన నటించిన చిరుత, రచ్చ, నాయక్, ఎవడు వంటి చిత్రాలు విజయం పొందినప్పటికీ అవన్నీ కేవలం మెగా అభిమానులను మాత్రమే అలరించాయి అని సినీ పండితులు బలంగా చెప్తుంటారు.

మగధీర వంటి భారీ విజయం అనంతరం ఆరంజ్ చిత్రంతో వినూత్న ప్రయోగం చేసిన చెర్రీ కి కోలుకోలేని ఎదురు దెబ్బ తగలటంతో చెర్రీ మూస ధోరణిలో చిత్రాలు చేయటానికి పరిమితమయిపోయాడు. కృష్ణ వంశి తెరకెక్కించిన గోవిందుడు అందరివాడేలే ఇందుకు మినహాయింపు కాగా తాజాగా విడుదల అయిన ధ్రువ చరణ్ శైలి సినిమాలకు భిన్నంగా ఉండటంతో మెగా అభిమానులు కొంత నిరాశ చెందినప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ అయ్యే అవకాశం వుంది. అవసరం అయిన చోటనే పాటలు, యాక్షన్ సన్నివేశాలు పెట్టి ప్రేక్షకుడిని ఉత్కంఠత తో కూర్చోపెట్టగలిగే కథనాన్ని నమ్ముకుని ధ్రువ చిత్రం చేసాడు చెర్రీ.

చెర్రీ అంగీకరించిన తదుపరి చిత్రం సుకుమార్ దర్శకత్వంలో ఉండటంతో ఆ చిత్రంలో కూడా కథకు సంబంధంలేని హీరోయిక్ ఎలిమెంట్స్ ఉండవనే విషయం స్పష్టంగా తెలిసిపోయింది. సుకుమార్ గతంలో బన్నీ, మహేష్ బాబు, తారక్ వంటి స్టార్ హీరోస్ తో చిత్రాలు చేసినప్పుడు కూడా ఎటువంటి వాణిజ్య అంశాలు జోడించకుండా సినిమాలు తెరకెక్కించారు. చెర్రీ కూడా రానున్న చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ అవుతూనే తన అభిమానులను తృప్తి పరిచే విధంగా చిత్రాలు చేయబోతున్నాడు. సుకుమార్ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో పని చేయబోతున్న చెర్రీ ఓవర్ సీస్ లోనూ మార్కెట్ సుస్థిరం చేసుకోవాలంటే నూతన శైలి మాత్రమే మార్గం అని గ్రహించినట్టున్నాడు.

Similar News